Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై మీమాంస... భక్తులు లేకుండానే మాడ వీధుల్లో ఉత్సవాలు!?

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై మీమాంస... భక్తులు లేకుండానే మాడ వీధుల్లో ఉత్సవాలు!?
, సోమవారం, 12 అక్టోబరు 2020 (11:08 IST)
తిరుమల వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను మాత్రం భక్తులు లేకుండానే ఏకాంతంగా నిర్వహించారు. ఇపుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏ విధంగా నిర్వహించాలన్న మీమాంసలో తితిదే అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు.
 
ఒకవైపు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించి మాఢ వీధుల్లో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు, భక్తులు లేకుండా మాఢ వీధుల్లోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇంకోవైపు.. కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గని పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
నిజానికి గత నెలలో అధికమాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇపుడు నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, వీటిని ఎలా నిర్వహించాలన్న విషయమై మీమాంసలో పడింది. 
 
ఈ బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలా? లేక మాడ వీధుల్లో నిర్వహించాలా? అన్న సమస్య ఇప్పుడు పట్టుకుంది. టీటీడీ నూతన ఈఓగా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి, ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు పలువురు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.
 
వాస్తవానికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 16న ప్రారంభమై, 24 వరకూ జరగాల్సి వుంది. ఈ ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలన్న ఆలోచనతో ఆలయం చుట్టూ ఉన్న గ్యాలరీల్లో భక్తులు కూర్చోవాల్సిన స్థానాలను నిర్దేశిస్తూ, మార్కింగ్స్ కూడా వేశారు. ఈ పనులను పరిశీలించిన ఈఓ, ఆపై భౌతికదూరం అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. తనకు సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 
 
అయితే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాహన సేవలను మాడ వీధుల్లో భక్తుల మధ్య నిర్వహించడం ప్రమాదకరమని, ఎవరిలోనైనా వైరస్ ఉంటే, అది ఎంతో మందికి సోకే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. 
 
దీంతో భక్తులు లేకుండా, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అన్ని పరిస్థితులనూ సమీక్షించిన తర్వాత, బ్రహ్మోత్సవాల నిర్వహణపై నేడో, రేపో ఓ నిర్ణయానికి టీటీడీ రానుందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-10-2020 నుంచి 17-10-2020 వరకు మీ వార రాశి ఫలితాలు ఇలా వున్నాయి- video