Publish Date: Mon, 28 Mar 2016 (18:15 IST)
Updated Date: Mon, 28 Mar 2016 (18:17 IST)
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ ఆలయాల్లో వేదపారాయణదారులు, భజనమండళ్ళ సభ్యులు, శ్రీవారి సేవకుల సేవలను ఉపయోగించుకోవాలని టిటిడి కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఇటీవల టిటిడిలో విలీనమైన రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం, గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విశాఖపట్నం జిల్లా ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లో భజనమండళ్లు, శ్రీవారి సేవకుల వివరాలు సేకరించి వాటిని వినియోగించుకోవడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారి జీతాలను కూడా ప్రతినెలా చెల్లించాలని ఆదేశించారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణవేదిక, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలిపిరి వద్ద గల టూరిస్టు బస్టాండ్ వద్ద దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతిరోజు దాదాపు వంద బస్సుల్లో విచ్చేసే యాత్రికులకు తాగునీరు అందించాలని, భూదేవి వసతి సముదాయాన్ని భక్తులు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎండ వేడిమి తగులకుండా సేవ చేయాలని టిటిడి ఇఓ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని బస్టాండ్, రైల్వేస్టేషన్‌పాటు అలిపిరి, శ్రీవారి పాదాల మండపం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురం, గోవింరాజస్వామి ఆలయాలకు వచ్చే భక్తులకు ఉచితంగా చల్లటి మంచినీటితో పాటు ఒఆర్ఎస్ పౌడర్లను అందించాలని టిటిడి ఇఓ నిర్ణయం తీసుకున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.