Publish Date: Fri, 18 Mar 2016 (16:45 IST)
Updated Date: Fri, 18 Mar 2016 (16:50 IST)
తిరుమల లడ్డూ రేట్లను ఇప్పట్లో పెంచబోమన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి. సామాన్య భక్తుల కోసం ప్రవేశపెట్టిన 300 రూపాయల శీఘ్ర దర్శన టోకన్ల రేట్లను పెంచకుండా విఐపి బ్రేక్ దర్శన టికెట్ల రేట్లను మాత్రం పెంచతామన్నారు చదలవాడ. గతంలో టిటిడి సబ్‌కమిటీ సూచనలు చేసిన విధంగా ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని అనుకున్నా సభ్యులందరు ఆమోదించకపోవడంతో వెనక్కి తగ్గింది టిటిడి పాలకమండలి.
కేవలం విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల రేట్లను మాత్రమే పెంచుతామన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలికి బంగారు పూతరేకుల కోసం దాతల విరాళాల కోసం ఎదురుచూస్తున్నామని, దాతలు ముందుకు రాకుంటే టిటిడినే ఆ పనులను పూర్తి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి 5 కోట్ల రూపాయల విలువైన సాలిగ్రామం, బంగారు చైన్లను త్వరలో ఇవ్వనుందని తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని వెంకటగిరి రాజా నిర్మించిన క్రిష్ణుని ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకున్నామని చెప్పారు.
ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమైందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి చెందిన 2.74 ఎకరాల స్థలాన్ని దక్షిణమధ్య రైల్వేకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. అప్పలాయగుంటలో అష్టదళ పాదపద్మారాధన సేవతో పాటు తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేక సేవలను తీసుకువస్తున్నట్లు చెప్పారు చదలవాడ.