Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపటి నుంచి తిరుపతి గంగమ్మ జాతర.. శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ధి...

రేపటి నుంచి తిరుపతి గంగమ్మ జాతర.. శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ధి...
, సోమవారం, 9 మే 2016 (11:36 IST)
రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతర మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతరకు వివిధ జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలి రానున్నారు. తొమ్మిది రోజుల పాటు వైభవోపేతంగా ఈ జాతర జరుగనుంది.
 
ఆధ్మాత్మిక నగరి తిరునగరి. అమ్మలగన్న అమ్మ గంగమ్మ తిరుపతిలో కొలువైంది. గంగమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. తాతయ్యగుంట గంగమ్మదేవత జన్మదినమైన చిత్రనెల చివరివారంలో గంగమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం నుంచి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. కలియుగ దైవం శ్రీనివాసునికి చెల్లెలుగా గంగమ్మను చెప్పుకుంటుంటారు. దీంతో ఈ ఉత్సవాలు ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. 
 
తాతయ్యగుంట గంగమ్మ జాతర పేరుతో జరిగే ఉత్సవాల పేరుతో ఆరువేషాలను భక్తులు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగివేషంతో ప్రారంభమై... బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగి వేషం, సున్నపుకుండలు వేషాలతో మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. 
 
ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టం ఆడవారు మగవేషం వేయడం, మగవారు ఆడవేషం వేయడం.. జాతర చివరి రోజు ఈ వేషాలను ధరిస్తారు. ఈ వేషాలను ధరించే సమయంలో దారిన పోయే భక్తులను బూతులు తిట్టినా పట్టించుకోరు. అంతటి ప్రాశస్త్యం చెందింది ఈ జాతర. అలాగే 18వ తేదీ వేకువజామున శ్రీ గంగమ్మ విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఉదయాత్పూర్వమే పేరంటాళ్ళ వేషం ధరించిన వంశస్ధుడు అమ్మవారి చెంపనరకడంతో జాతర పూర్తవుతుంది. 
 
అమ్మవారి విశ్వరూప నిర్మాణానికి ఉపయోగించిన బంకమట్టిని స్వీకరించడానికి భక్తులు పోటీ పడతారు. ఈ బంక మట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలికమైన వ్యాధులు, గృహబాధలు, దేహబాధలు, భయం నశిస్తాయని భక్తుల నమ్మకం. తాతయ్యగుంట గంగమ్మ కేవలం గ్రామదేవత మాత్రమే కాదు. మహిమాన్వితమైన శక్తి స్వరూపిణి. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ శ్రీ గంగమ్మ తల్లి అనుగ్రహం.. అనుమతి ఉన్నప్పుడు మాత్రమే తిరుపతి నగరంలో క్షేమంగా స్థిరంగా నివసించడం సాధ్యమౌతుంది. గంగజాతర 8 రోజుల పండుగ. ఇది కేవలం తిరుమల తిరుపతికి మాత్రమే గాక రెండు తెలుగు రాష్ట్రాల్ల ప్రజలు ఉత్సాహంతో ఉత్సవాలను జరుపుకుంటారని ఆలయ అర్చకులు శ్రీరామ క్రిష్ణశర్మ చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం