Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లు మరో 4 వేలు పెంపు

Advertiesment
tirumala special darshan online tickets increase
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రద్దీకి అనుగుణంగా ఆన్‌లైన్‌లో అందుబాటును పెంచాలని తితిదే నిర్ణయించింది. అంతర్జాలం, ఈ- దర్శన్‌ కేంద్రాలతో పాటు తిరుపతిలో కరెంట్ బుకింగ్‌ కింద ప్రస్తుతం వారాంతంలో రోజుకు 16 వేలు, వారపు రోజుల్లో 24 వేల వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయం జరుగుతోంది. ఇందులో ఆన్‌లైన్‌ ద్వారా రోజుకు 12 వేల టికెట్లను విడుదల చేస్తున్నారు. వేసవి సెలవుల్లో యాత్రికుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టికెట్లను రోజుకు 16 వేల వరకు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచాలని నిర్ణయించారు. 
 
శ్రీవారి దర్శనానికి వెళ్లే 3 గంటలకు ముందు నుంచి 60 రోజుల వరకు ఈ టికెట్లు నమోదు చేసుకునే సౌలభ్యం ఉంది. సాధారణంగా వారాంతంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇందుకు భిన్నంగా శని, ఆదివారాలు (16, 17 తేదీల్లో) రద్దీ సాధారణంగా ఉంది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ.50 సుదర్శనం టోకెన్ల జారీని తితిదే తాత్కాలికంగా నిలిపివేసింది. సుదర్శనం టోకెన్లను ఈ-దర్శన్‌ కేంద్రాల ద్వారా తితిదే విక్రయిస్తోంది. ఏటా వేసవి సెలవుల్లో వీటి విక్రయం ఆపివేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
మరోవైపు... తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 79,646 మంది భక్తులు దర్శించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu