బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను సోమవారం చేస్తారు.
శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే అంకురార్పణ కార్యక్రమాలు రాత్రి 7 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తారు. రాత్రి ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే 'మృత్సంగ్రహణ యాత్ర' (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.
స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు రాత్రి 7 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమర మాడవీధి నైరుతి మూలలో ఉన్న వసంత మంటపానికి వేంచేస్తారు. అక్కడ అర్చకస్వాములు నవపాలికల్లో పుట్టమన్నును సేకరించి మిగిలిన మాడవీధుల మీదుగా ఊరేగుతూ ప్రదక్షిణగా ఆలయానికి వస్తారు.
యాగశాలలో కైంకర్యాలతో పాటు పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే అంకురార్పణ (బీజవాపం) ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనాలతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.