Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ దఫా బ్రహ్మోత్సవాలకు సర్వదర్శనం : తితిదే కీలక నిర్ణయం

Advertiesment
tirumala
, ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:36 IST)
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ సర్వదర్శనమే ఉంటుందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ యేడాది బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇదేసమయంలో పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే నిర్వహించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. 
 
గరుడసేవ రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దుచేస్తుంటారు. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈదఫా తితిదే మరింత ముందుకెళ్లింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లనూ నిలిపివేసింది. వీటిని బ్రహ్మోత్సవాల పది రోజులూ రద్దుచేయడంతో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 
 
నేడు జరగాల్సిన తితిదే కల్యాణమస్తు వాయిదా! 
తితిదే ఆధ్వర్యంలో ఆదివారం జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా పడినట్లు సమాచారం. 2011లో ఆగిపోయిన కల్యాణమస్తును తిరిగి 2022లో తితిదే ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద హిందూ కుటుంబాల్లోని యువతీ యువకులకు సంప్రదాయబద్ధంగా వివాహం చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివాహ వేడుకలను నిర్వహించాల్సి ఉంది. 
 
అందులో భాగంగా చాంద్రమాన శుభకృత్‌ నామ సంవత్సరం శ్రావణ శుక్లపక్ష దశమి ఆదివారం ఉదయం 8.07 నుంచి 8.17 గంటల మధ్య అనురాధ నక్షత్రం, సింహలగ్నంలో వివాహాలు చేయించాలని పండితులు శుభ ముహూర్తం నిర్ణయించారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే చాలామంది సామూహిక వివాహాలకు జిల్లా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. తితిదే ఇప్పటివరకూ అధికారికంగా వాయిదాపై ఎలాంటి ప్రకటనా జారీచేయలేదు. త్వరలోనే మరో ముహూర్తం నిర్ణయించి కల్యాణమస్తును నిర్వహించేందుకు తితిదే సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-08-2022 ఆదివారం దినఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...