ఆదివారం ఉదయం సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.38 గంటలకు ముగియనుంది. గ్రహణం కారణంగా శ్రీకాళహస్తి మినహా రాష్ట్రంలోని ఆలయాలు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం నుంచే ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు. ఒక్క కాళహస్తీశ్వర ఆలయం మాత్రం తెరిచివుంచారు.
ఇక కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ ముగియగానే.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తెరుస్తారు. నిత్య కైంకర్యాల తర్వాత ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. గ్రహణం కారణంగా ఈ ఆదివారం నాడు ఆర్జిత సేవలు, దర్శనాలను తితిదే పూర్తిగా రద్దు చేసింది.
మరోవైపు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసివున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని గ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకే మూసివేశారు. పంచహారతులు, నివేదన అనంతరం.. కవాట బంధనం చేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు.. ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతులు ఇస్తారు. గ్రహణం రోజున అన్ని రకాల ఆర్జిత సేవలను, దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
అదేవిధంగా, శ్రీశైల భ్రమరాంబామల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని గ్రహణం సందర్భంగా శనివారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. ఆదివారం గ్రహణం వీడిన తర్వాత మంగళ హారతులు, కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. సోమవారం నుంచి యథావిథిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం శనివారం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. శుద్ధి అనంతరం ఆదివారం సాయంత్రం 5 గంటలకు దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. శ్రీకూర్మంలోని కూర్మనాథస్వామి ఆలయాన్ని ఆదివారం ఉదయం 6 గంటలకు మూసివేశారు. విశాఖ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం సింహాచలం.. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం.. కర్నూలు జిల్లా అహోబిలంతో పాటు.. మరిన్ని ఆలయాల్లో సంప్రదాయం ప్రకారం దర్శనాలు నిలిపివేశారు.