కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడివున్న శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్ర ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. మాస పూజల కోసం ఈ ఆలయాన్ని తెరిచారు. దీంతో చింగం మాస పూజలు అయిదు రోజులు నిర్వహించనున్నారు.
ఈ పూజలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్19 నిబంధనలు ఉన్న నేపథ్యంలో.. భక్తులను అనుమతించడం లేదు. ఆలయాన్ని ఈనెల 21వ తేదీన మూసివేస్తారు. మలయాళం కొత్త సంవత్సర దినం సందర్భంగా ఆగస్టు 17వ తేదీ నుంచి అన్ని అయ్యప్ప ఆలయాలను తెరవాలని ట్రావెన్‌కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది.
దక్షిణ భారత దేశంలో ఆ బోర్డు కింద సుమారు వెయ్యి ఆలయాలు ఉన్నాయి. మళ్లీ ఓనమ్ పూజ కోసం ఆగస్టు 29వ తేదీన శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. సెప్టెంబరు రెండవ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుందని టీడీబీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 16వ తేదీన శబరిమల వార్షిక ఉత్సవాలు మొదలు అవుతాయని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.