నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

బుధవారం, 31 అక్టోబరు 2018 (15:57 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకంపై విధించిన నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే పరిశుభ్రతలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకున్న తితిదే... తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ నెల 2న గాంధీ జయంతి రోజు నుంచి తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ కవర్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. 
 
దీంతో తిరుపతి నగరంలో చాలావరకు ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోయాయి. తిరుపతి వాసులు కూడా ప్లాస్టిక్ కవర్లు లేక పోవడంతో, క్లాత్ బ్యాగ్స్, కాటన్ బ్యాగులు వంటి ప్రతామ్నాయ వస్తువులకు అలవాటుపడుతున్నారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుగాడే తిరుమలలో కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
 
తిరుమల నిత్యం భక్తుల రద్దీతో కిటికిటలాడే పుణ్యక్షేత్రం. ఇక్కడకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు తమతో తెచ్చుకునే లగేజీలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉంటున్నాయి. ఇక హోటల్స్ షాపులు కూడా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడుతున్నారు. టీటీడీ కూడా తను ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో ప్లాస్టిక్ కవర్లే వాడుతోంది. వీటన్నింటిపై నిషేధం విధించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దీపావళి రోజున ఆ మంత్రాన్ని జపిస్తే..?