శాకాంబరిగా చెముడులంక ధనలక్ష్మి అమ్మవారు కళకళలాడిపోతోంది. వంద కేజీల కూరగాయలతో అలంకరణ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల కూడలైన, ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారిపై కొలువుదీరి వున్న ధనలక్ష్మి అమ్మవారు శాకాంబరిగా దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం శుక్రవారం వారం సందర్భంగా ఈ గ్రామ రైతులు సమకూర్చిన వంద కేజీల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు.
ఆలయ ధర్మకర్త ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో లంకల్లో పండే వంగ, దొండ, బెండ, మిర్చి, టమోటా,బీర,మునగ వంటి కూరగాయలతో అమ్మవారి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ పురోహితుడు ప్రభాకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. అంతేకాదు చెముడులంక జాతీయ రహదారిపై వెళ్ళే ప్రతి ప్రయాణికుడు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శాకాంబరిగా అలంకరణ అద్భుతంగా ఉందని వేనోళ్ళ పొగడుతున్నారు.