తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీవేటు పడింది. ఈ మేరకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం అదనపు ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ధర్మారెడ్డిని, కొత్త ఈఓ నియామకం జరిగే వరకూ ఇన్‌చార్జ్ ఈఓగా నియమిస్తున్నట్టు గురువారం వెల్లడించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా, అనిల్ కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
కాగా, తితిదేకి ఈఓగా రాకముందు అనిల్ కుమార్ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన టీటీడీ ఈఓగా 2017లో బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల కాలపరిమితికి ఆయన బాధ్యతలు స్వీకరించగా, 2019లో మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు.
దాదాపు మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు టీటీడీ ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని మరింత దగ్గర చేస్తూ, కీలక సంస్కరణలను అమలు చేశారు. క్యూలైన్లలో రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా టైమ్ స్లాట్ టోకెన్ విధానానికి రూపకల్పన చేసి అందరి మన్నలు పొందారు.
అదేసమయంలో పూర్తిస్థాయి కొత్త ఈవోగా జవహర్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన ఏపీ సీఎం.జగన్‌తో పాటు.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు అత్యంత నమ్మకస్తుడుగా పేరుపొందారు.