కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం కాసుల వర్షం కురుస్తూనే వుంటుంది. వెంకన్నకు భారీగా విరాళాలు, కానుకలు వచ్చి చేరుతుంటాయి. తిరుమల ఆలయంలోని వెంకన్నకు పసిడి కిరీటాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో తితిదే ఆధ్వర్యంలోని గోవింద స్వామి ఆలయంలో మూడు కిరీటాలు కనిపించట్లేదని.. అదృశ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. గోవింద స్వామి ఆలయంలోని మూల విరాట్‌కు అలంకరించే మూడు కిరీటాలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
దీనిపై ఆలయ పూజారులు.. ఆలయ నిర్వాహకుల వద్ద విషయాన్ని తెలియజేశారని.. బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా గోవింద స్వామి కిరీటాలు చోరీకి గురయ్యాయని ఇందుకోసం ప్రత్యేక బృందం బరిలోకి దిగి దర్యాప్తు మొదలెట్టిందని సమాచారం.
శనివారం సాయంత్రం పూజలు పూర్తయ్యాక నైవేద్యం సమర్పించారని.. తర్వాత ఆలయాన్ని మూతవేశారు. తిరిగి పూజ కోసం ఆలయాన్ని తెరిస్తే.. గోవింద స్వామి పసిడి కిరీటాలు అదృశ్యమయ్యాయని తెలిసింది. ఇవి 528 గ్రాములతో కూడిన రెండు కిరీటాలు, 408 గ్రాములతో కూడిన ఓ కిరీటం మాయమైందని.. శ్రీదేవి, భూదేవి, గోవింద స్వామికి ధరించే మూడు కిరీటాలను కాజేశారని ప్రత్యేక బృందం వెల్లడించింది. దీనిపై ఆలయ అధికారులు, పూజారులు, ఉద్యోగుల వద్ద విచారణ జరుపుతున్నట్లు దర్యాప్తు బృందం తెలిపింది.