Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవి సెలవుల్లో శుక్రవారం బ్రేక్‌ దర్శనాలు రద్దు - ప్రముఖులకు మాత్రమే

Advertiesment
break darshan
వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి శుక్రవారాల్లో బ్రేక్‌ దర్శనాలు ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వర్తిస్తాయని తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వేసవి సెలవుల ఏర్పాట్లపై టిటిడి ఇఓ వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేసవిలో భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో అన్ని విభాగాల వారు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేసుకోవాలలని అధికారులకు సూచించామన్నారు. అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనూ, బయట క్యూలైన్లలోను నీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు భక్తులకు విరివిగా అందించాలన్నారు. అదేవిధంగా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాయంకాలం ఒక గంట మాత్రమే విరామం తీసుకుని నిరంతరాయంగా అన్నప్రసాదాలను భక్తులకు అందించాలన్నారు.
 
కంపార్టుమెంట్లు, బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు సరఫరా చేసేందుకు తగినంతమంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని సూచించారు రెండు నడక మార్గాలలో నడిచి వచ్చే భక్తుల కోసం మంచినీరు, ఓ.ఆర్.ఎస్‌.ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రిసెప్షన్‌, ఐటీ అధికారుల సమన్వయంతో పనిచేసి కంప్యూటర్‌ సర్వర్లు డౌన్‌ అయినప్పుడు ప్రత్యామ్యాయ మార్గాలు అన్వేషించి అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 6 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు.
 
భక్తుల లగేజి కౌంటర్లలో డిపాజిట్‌ చేసేటప్పుడు తమ బ్యాగులలో చెప్పులు, సెల్‌ఫోన్స్ వగైరా బ్యాగులలోనే ఉంచి తాళం వేసుకోవడం ద్వారా ఒకే కౌంటర్‌లోనే అన్ని డిపాజిట్‌ చేయవచ్చని ఈవో తెలిపారు. తద్వారా భక్తులు చెప్పులు, సెల్‌ఫోన్‌‌లకు ప్రత్యేకంగా కౌంటర్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ విషయాన్ని భక్తుల గమనించాలని కోరారు. భక్తులు తిరుమలకు వచ్చేటప్పుడు తమ వెంట ఆధార్‌ కార్డు తీసుకురావడం మరిచిపోకూడదని వసతి, దర్శనం వంటి సౌకర్యాల కల్పనలో ఆధార ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈవో తెలిపారు. ఘాట్‌ రోడ్డులలో భక్తులు విసిరేసే ప్లాస్టిక్‌ బాటిళ్లు, చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu