శ్రీశైలం స్పర్శ దర్శనం టికెట్ కొనుగోలు చేసే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూను ప్రసాదంగా అందజేస్తామని శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పి. రమేష్ నాయుడు ప్రకటించారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో, ప్రఖ్యాత శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మల్లికార్జున స్వామి- భ్రమరాంబ దేవి దర్శనం కోసం యాత్రికులు తరలివస్తున్నారు. నవంబర్ 14న జరగనున్న కోటి దీపోత్సవానికి కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా, స్పర్శ దర్శనం పొందే భక్తులందరికీ ఆలయం ఒక లడ్డూను ఉచితంగా అందిస్తుందని చైర్మన్ పేర్కొన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జునస్వామిని తమ చేతులతో తాకుతూ 'స్పర్శ దర్శనం' చేసుకోవడం ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు భక్తులు. ఈ క్రమంలోనే శ్రీశైల దేవస్థానం బోర్డు సామాన్య భక్తుల సౌకర్యార్థం గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఉచిత స్పర్శ దర్శనాన్ని జులై 1వ తేదీ నుంచి పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే.