కోవిడ్ కేసులు తగ్గిపోయాయి.. ఇక ఏముందిలే..తిరుమల దర్సనానికి ఇలా వెళ్ళి అలా వచ్చేయవచ్చు అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, రెండు డోస్‌ల సర్టిఫికెట్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ టిటిడి మాత్రం ఆ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులు తూచా తప్పకుండా ఆ రెండింటిలో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకురావాలని స్పష్టం చేస్తోంది. తిరుపతిలోని అలిపిరి వద్దే ఆ సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపించనున్నారు టిటిడి సెక్యూరిటీ అధికారులు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా భక్తులను తిరిగి పంపించేస్తామని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు టిటిడి అధికారులు.