Publish Date: Wed, 24 Feb 2016 (10:55 IST)
Updated Date: Wed, 24 Feb 2016 (10:57 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇచ్చే మహాప్రసాదం లడ్డూలో నాణ్యత లోపిస్తుందనేందుకు తాజా ఘటన నిదర్శనం. గతంలో శ్రీవారి లడ్డూలో మేకులు కనిపించిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం లక్షల సంఖ్యలో లడ్డూలు తయారవుతున్న తరుణంలో .. తిరుమల లడ్డూలో మంగళవారం ఓ పిన్నీసు కనబడి కలకలం రేపింది.
ప్రసాదం పంపిణీ కేంద్రాల్లోని 13వ కౌంటర్ నుంచి ప్రసాదం స్వీకరించిన ఓ భక్తుడు అందులో పిన్నీసును చూసి షాకయ్యాడు. వెంటనే తేరుకున్న అతడు... పిన్నీసు ఉన్న సదరు లడ్డూను తిరిగి ఆ కౌంటర్‌లోని సిబ్బందికి స్వాధీనం చేశాడు. దీనిపై స్పందించిన టీటీడీ... రోజూ 3.5 లక్షల లడ్డూలు తయారవుతున్నారని, ఈ క్రమంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సహజమేనని ప్రకటించింది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. అయితే లడ్డూ ప్రసాదంపై పదే పదే విమర్శలు వస్తున్న తితిదే బేఖాతరు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.