Publish Date: Mon, 30 Mar 2020 (12:38 IST)
Updated Date: Mon, 30 Mar 2020 (12:39 IST)
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పడరాని పాట్లు పడుతుంటారు. తమ జీవితకాలంలో ఆ కలియుగ వైకుంఠాన్ని ఒక్కసారైనా తనివితీరా చూడాలని ప్రతి ఒక్క భక్తుడూ పరితపిస్తుంటారు. అలాంటిది.. కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని తిరుమల గిరులు గత పది రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయాయి. దీనికి కారణం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండటంతో పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆలయంలోని మళ్లీ భక్తులను ఎపుడెపుడు అనుమతిస్తారా? అంటూ ప్రతి ఒక్క భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే, దేశంలో ఇంకా కరోనా వైరస్ భయం తొలగిపోలేదు. దీంతో లాక్‌డౌన్ అమలైనన్ని రోజులూ దర్శనాలను ఆపేయాలని టీటీడీ నిర్ణయించింది. అంటే ఏప్రిల్ 14 వరకూ భక్తులకు దర్శనాల రద్దు నిర్ణయం కొనసాగుతుందని టీడీడీ వెల్లడించింది.
ఆలయ అవసరాలకు తిరిగే అత్యవసర వాహనాలకు మినహా, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేశామని తెలిపింది. స్వామివారికి చేయాల్సిన అన్ని సేవలూ ఆగమశాస్త్రోక్తంగా జరుగుతున్నాయని, తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నుంచి రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ వరకూ అన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే, వచ్చే నెలలో జరగాల్సిన వార్షిక వసంతోత్సవాలపై మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొన్నారు.
ఠాగూర్
Publish Date: Mon, 30 Mar 2020 (12:38 IST)
Updated Date: Mon, 30 Mar 2020 (12:39 IST)