కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కూడా కఠినతరమైంది. కోవిడ్ నిబంధనలతో పాటు కోవిడ్ ఆంక్షల కారణంగా దర్శనాల అమలులో తితిదే అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం పరిమిత సంఖ్యలోనే పంపిస్తున్నారు.
అయితే, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దర్శనాల సంఖ్యను పెంచే యోచనలో తితిదే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి తితిదే అనుమతిస్తున్నది. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని భావిస్తోంది.
ఇందులోభాగంగా, సెప్టెంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. కరోనా కారణంగా జులై 16 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన విషయం విదితమే. అయితే.. సెప్టెంబర్ నుంచి 20 వేల నుంచి 30 వేల మందిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ విషయంపై టీటీడీ పాలకమండలిలో తుది నిర్ణయం తీసుకుంటారు.
సెప్టెంబరులో ఎన్నో విశేషాలు...
ఇదిలావుంటే, సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇక సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరుగుతుంది.