అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మెట్రో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అనుమతించాలంటూ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మెట్రో ప్రారంభం అంశం తెరపైకి రావడం గమనార్హం.
ఇంకా కరోనా వైరస్ కారణంగా మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా వీటిని ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు హోమ్‌శాఖ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 31తో అన్‌లాక్ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో 4.0కు సంబంధించి కొత్త నియమ నిబంధనలపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సేవలను అనుమతించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వీటితో పాటు మరికొన్ని ప్రజా రవాణా, ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, స్కూళ్లు, కళాశాలలు మాత్రం ఇప్పటికిప్పుడే ప్రారంభించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. అలాగే బార్లను తెరవకుండా కేవలం మద్యాన్ని తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతించాలని భావిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు.