Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పొలిస్వర్గం' అంటే ఏమిటి?

webdunia
  • facebook
  • twitter
  • whatsapp
share
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:13 IST)
హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది కార్తీకమాసం. కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’.  అసలు పొలిస్వర్గం అంటే ఏమిటి? ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? తెలుసుకుందాం. 
 
పోలిస్వర్గం అచ్చం ఒక తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ తెలుపుతుంది ఈ కధ. పూర్వం కృష్ణాతీరం లోని ఒక ఊరిలో ఒక రజక కుటుంబం ఉండేది. తమ ఐదుగురు కొడుకులకు వివాహం అయినా కలిసి ఉమ్మడి కుటుంబం గానే జీవిస్తున్నారు.

ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లలో చిన్నకోడలే పోలమ్మ. పోలమ్మను పోలి అని ప్రేమగా పిలిచేవారు. చిన్నతనం నుంచే దేవుడు అంటే ఎనలేని భక్తి కల పోలమ్మ నిత్యం పూజలు చేస్తుండేది. పెళ్లి జరిగేంతవరకు దైవ భక్తితో గడిపిన పోలికి పెళ్లయిన తర్వాత ఆమె భక్తి, పూజలు ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది.

తనలాంటి మహా భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావంతో మెలిగేది. అందుకే కార్తికమాసం రాగానే తన చిన్నకోడలిని కాదని మిగతా నలుగురు కోడళ్లను తీసుకుని రోజూ నదికి వెళ్లి, స్నానం చేసి, దీపాలను వెలిగించి తిరిగొచ్చేది.
 
ఈలోగా చిన్న కోడలు పోలి ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో, దీపం పెట్టడానికి కావాల్సిన సామగ్రి అయిన నూనె, వత్తులు తదితర అవసరమైన సరంజామాను ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేది. అయితే, పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు.

తమ పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి, కవ్వానికి ఉన్న వెన్నను వత్తికి రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా ఉండడానికి దానిపై బుట్టని బోర్లించేంది.

తన అత్తగారు ఎన్ని ఆటంకాలు కల్పించినా, నిర్మలమైన మనసుతో, ఎంతో భక్తి శ్రద్ధలతో, కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించి, హరిహారాదులను ప్రార్ధించేది పోలి. చివరికి కార్తీక మాసం ఆఖరిరోజు అమావాస్య రానే వచ్చింది.

కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీస్నానం చేసి, ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు తన మిగతా నలుగురు కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే అవకాశం ఇవ్వకుండా, తీరిక లేకుండా పనులన్నీ అప్పగించి వెళ్ళింది.

కానీ, పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి, ఎప్పటిలాగే భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా, ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు.

వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిమానం దివి నుండి భువికి దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె మిగతా కోడళ్లు ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని భ్రమపడి, తాము కార్తీకమాసం లో చేసిన దీపారాధనల పుణ్య ఫలమని ఎంతగానో మురిసిపోయారు.

కానీ అందులో చిన్న కోడలు పోలి కూర్చుని ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు.

అప్పుడు విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ, వారికి పోలి చేసిన దీపారాధనల గురించి చెబుతూ, వారిని క్రిందకు దింపారు.
 
ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తల్చుకుంటారు.

కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని నమ్మకం. వీలైతే ఆరోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు.
 
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మీ రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇదీ పోలిస్వర్గం వివరం!

కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటుంచితే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం.

భగవంతుడిని కొలవడానికి కావల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందుకే కార్తీకమాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

Share this Story:
  • facebook
  • twitter
  • whatsapp

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

webdunia
14-12-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే..