Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరసింహ స్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయట!

నరసింహ స్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయట!
, బుధవారం, 27 మార్చి 2019 (11:02 IST)
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ఎత్తిన అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒకటి. భక్తుడు ప్రహ్లాదుడు ప్రార్థన మేరకు స్వామి అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని సంహరించాడు.


అనంతరం ఉగ్రనరసింహుడు శాంతించిన ప్రాంతం, ఎల్లవేళలా పూజలందుకుంటున్న క్షేత్రం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అష్టదిక్పాలకులతో ఏర్పడిన అష్టభుజి కోనేరు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. నరసింహ స్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చని ప్రతీతి. 
 
నిజామాబాద్‌ జిల్లాలోని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి కాకతీయుల ఆరాధ్య దైవంగా పూజలందుకున్నాడు. నాభిలో సాలగ్రామాన్ని ధరించిన ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి రూపం శివకేశవుల మధ్య అభేదాన్ని తెలుపుతుంది. ఈ క్షేత్రానికి స్థలపురాణం ఉంది. తండ్రి పెడుతున్న హింసల నుండి ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన నరసింహస్వామి, తన ఉగ్రరూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటాడు. 
 
వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో అక్కడే సేదతీరుతాడు. ఆ రూపాన్ని చూసి అక్కడ తపస్సు చేస్తున్న మునులు భయపడతారు. వారు బ్రహ్మదేవుడిని ప్రార్థించి సాధారణ రూపానికి తీసుకురమ్మని కోరుతారు. బ్రహ్మ సూచన మేరకు గండకీ నదితీరంలోని సాలగ్రామాన్ని తెచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా శాంతించి అక్కడే లక్ష్మీనరసింహ స్వామిగా వెలశాడని స్థల పురాణం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే శనిదోషాలు పోతాయని ప్రతీతి. 
 
అందుకే శనివారంతోకూడిన అష్టమీ, అమావాస్య తిథుల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కలియుగం ప్రారంభంలో మునులు ఈ దండకారణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు రాక్షసులు ఆటంకాలు కలిగించే వారు. వారి భారి నుండి బయటపడటానికి మునులు లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకోగా. స్వామి ఆజ్ఞ మేరకు అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కులకూ కాపలా ఏర్పడ్డారు. 
 
రుఘుల తపస్సుకు భంగం కలగకుండా మధ్యలో నీటి కొలను ఏర్పాటు చేసారు. అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది. శనిదోషాలు ఉన్నవారు శనిత్రయోదశి లాంటి విశేషమైన రోజుల్లో ఈ కోనేటిలో స్నానం చేసి గుట్టమీద ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-03-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - నిరుద్యోగులకు కలిసిరాగలదు...