Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం.. ఎక్కడుంది? (video)

విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం.. ఎక్కడుంది? (video)
, గురువారం, 21 మార్చి 2019 (15:09 IST)
అవతారమూర్తి అయిన శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం. విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాక ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. బ్రహ్మ ప్రతిష్టించిన పంచలింగ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయంలో చెప్పుకోవడానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. 
 
ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్థంబాలు ఉన్నాయి. స్వామివారు పడిమటి ముఖంగా వెలసి ఉండటం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. విశాల ప్రాకారాన్ని కలిగిన ఈ క్షేత్రంలో కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు కూడా కనువిందు చేస్తాయి. 
 
ఈ పుణ్యక్షేత్రానికి స్థల పురాణం ఉంది. పూర్వం దేవ దానవులు క్షీర సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద ఆధారం లేకపోవడంతో పర్వతం నిలవలేదు. మదించడానికి వీలుకాలేదు. ఆ సందర్భంలో విష్ణువుని ప్రార్థించగా తాబేలు రూపం ఎత్తి పర్వతానికి ఆధారంగా నిలిచాడు. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. 
 
పితృ కార్యాలంటే కాశీ గుర్తొస్తుంది. వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్లలేని చాలా మంది ఇక్కడ పితృకార్యాలు చేస్తారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం. 
 
ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ ఆలయం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజగదిలో గోపురం నిర్మించొచ్చా..?