Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

40 యేళ్ళకు ఒకసారి వచ్చే అత్తివరదర్ ఉత్సవం అంటే ఏంటి..?

40 యేళ్ళకు ఒకసారి వచ్చే అత్తివరదర్ ఉత్సవం అంటే ఏంటి..?
, గురువారం, 4 జులై 2019 (11:03 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000కి పైగా ఆలయాలు కలిగి ఉంది. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచిలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్యతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదాని కన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది). ఈ ఆలయ౦లోని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి.

పురాణ కాలంలో ఛతుర్ముఖ బ్రహ్మ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి(వరములను ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు. ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలుగకుండా ఉండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట.
webdunia
 
లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంత కాలంలో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తిని ప్రతిష్టించారు. 
అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 సంవత్సరంలకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీఅత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై ఒకటో తేదీన నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు.
 
మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమలోనూ, చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమలోనూ దర్శనం ఇస్తారు. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 నుంచి 12 వరకు సాయంత్రం 7 నుంచి 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఈ సేవలో స్వామిని సేవించడానికి రూ.500 టికెట్ తీసుకోవలసి ఉంటుంది.
webdunia
 
దర్శన సమయాలు... ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. తమిళనాడులోని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుంచి తిరుపతి, చెన్నైల నుంచి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. 
దర్శించండి... తరించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-07-2019 గురువారం రాశిఫలాలు : ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి..