గురునానక్ ఒక పట్టణం పొలిమేరలో విడిది చేసి నిత్యము సత్సంగము చేస్తున్నారు. ఒక భక్తుడు నిత్యము సత్సంగానికి వెళ్తూండేవాడు. ఒకరోజతడు రామదాసు అను తన బాల్యమిత్రుడైన వర్తకుని వద్దకెళ్ళి, "నీవెప్పుడూ ఈ వర్తకంలోనే కాలమంతా గడుపుచున్నావు. ఒక్కరోజు ఆ మహనీయుని సత్సంగానికొస్తే నీవు చేసిన పాపాలన్నీ తొలగి భగవదనుగ్రహం లభిస్తుంది" అని నచ్చచెప్పి అతనిని బయల్దేరదీసాడు. రామదాసు తన వర్తకమంతా మరొకరికి అప్పజెప్పి కొన్నిరోజులు విరామం తీసుకోడానికి యేర్పాటు చేసుకుని బయల్దేరాడు. కాని దారిలో ఒక అందమైన వేశ్య కనిపించేసరికి అతడామె ఇంటనే వుండిపోయాడు.
కొన్నిరోజులలా గడిచాక రామదాసు ఆమె యింటికొచ్చేసరికి వేశ్య యెక్కడికో వెళ్ళింది. అతడు నిరాశగా ఆ యింటి పెరట్లో కూర్చుని యేదో ఆలోచిస్తూ తన చేతి కర్రతో నేలపై మట్టిని తొలిచాడు. అక్కడొక కుండ దానిలో ఒక బంగారు నాణెము కన్పించాయి. అతడది లంకెబిందె అనుకొని త్రవ్వి తీసేసరికి దాని నిండుగా బొగ్గులు, ఆ ఒక్క బంగారు నాణెము వున్నాయి. అదైనా దొరికినందుకు అతడు సంతోషిస్తున్నాడు. ఇంతలో సత్సంగానికని బయల్దేరిన మిత్రుడు కుంటుతూ ఆ యింటి ముందుకొచ్చి, తన కాలులో పెద్ద ముల్లు గుచ్చుకున్నదని చెప్పాడు.
అపుడు రామదాసు నవ్వి, “ దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా, అవే నిజంగా వుంటే రోజూ సత్సంగానికెళ్ళే నీకు ముల్లుగుచ్చుకోవడమేమిటి, నీవంటివారి దృష్టిలో పాపిష్ఠినైన నాకు బంగారు నాణెం దొరకడమేమిటి?” అన్నాడు. అతని మిత్రుని మనస్సు గూడా చలించింది. అయినా అతడు కొంత నిగ్రహించుకుని, "ఈ ప్రశ్నకు గురునానక్ ఏమి సమాధానం చెబుతారో అడుగుదాము రా" అని రామదాసును గూడ తీసుకుని వెళ్ళాడు.
వారి ప్రశ్న ప్రశాంతంగా విని గురునానక్ యిలా సమాధానమిచ్చారు: “ఈ రామదాసు గత జన్మలో ఒక్క బంగారునాణెం మాత్రమే దానమిచ్చాడు. ఆ పుణ్యం వలన అతడికీ జన్మలో ఆ కుండ నిండుగా బంగారునాణేలు దొరకవలసివున్నది. కాని అతడీ జన్మలో చేసిన ఒక్కొక్క పాపం వలన ఒక్కొక్క నాణెము బొగ్గుగా మారి అతడిచ్చిన ఒక్క నాణెం మాత్రమే అతడికి దక్కింది. ఆ వేశ్య యింట్లో వుండి యితడీ రోజు కూడా తప్పుచేసి వుంటే ఈ నాణెం గూడా బొగ్గుగా మారిపోయేదే!" అని అతని మిత్రునితో యిలా అన్నారు.
"నీవు గత జన్మలో క్రూరుడైన ఒక రాజువి. ఎందరినో యుద్ధాలలోనూ, ద్వేషంతోనూ చంపావు. ఆ పాపానికి ఫలితంగా ఈ జన్మలో నీకు చిత్రహింస, ఉరి శిక్ష సంభవించవలసి వున్నది. నీవు సద్గురువు నాశ్రయించి, సత్సంగానికి హాజరవుతుండడం వలన ఒక్కొక్క పాపము క్షాళనై, చివరకు ఈ ముల్లు గుచ్చుకొనడంతో మిగిలిన కొద్ది పాపము తీరిపోయింది” అని చెప్పారు. ఆ మిత్రులిద్దరూ ఆయనకు నమస్కరించి నిత్యము సత్సంగానికి హాజరవసాగారు.