జ్యోతిర్లింగ పీఠాలలో ఎన్నో ప్రత్యేకతలు కలిగి వున్న క్షేత్రం ఉజ్జయినీ క్షేత్రం. శ్రీశైలం లాగానే జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగి అపురూప క్షేత్రం ఉజ్జయిని. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్ నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దక్షిణ ముఖంగా స్వామి వెలిసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. జ్యోతిర్లింగ అలయాలలో దక్షిణ ముఖంగా స్వామి వెలసిన ఆలయమిదొక్కటే.
మరో ప్రత్యేకత వింటే ఒడలు జలదరిస్తుంది. ఆలయం సమీపంలోనే ఉండే స్మశానం నుండి ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు చితాభస్మం సేకరించి తెచ్చి దానితో భస్మాభిషేకం నిర్వహిస్తారు. భస్మాభిషేకం తెల్లవారు జామున 4 గంటలకు నిర్వహిస్తారు. దాదాపు రెండు గంటలపాటు ఈ భస్మాభిషేకం కొనసాగుతుంది.
ఒక అఘోరా ఈ చితాభస్మాన్ని స్మశానం నుండి తీసుకొచ్చి, ఈ భస్మాభిషేకంలో పాల్గొంటాడు. మహాకాళేశ్వర లింగాన్ని ప్రతివారూ తాకి పూజించవచ్చు. మహాకాళేశ్వర అర్చనలో వాడిన బిల్వపత్రాలు, పూవులు మిగతా ఆలయాలలో మాదిరి పారేయకుండా శుభ్రపరిచి మరలా వాడటం ఇక్కడి మరో ప్రత్యేకత.