లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం విలయతాండవం చేస్తున్నాయి. అధర్మం పెరిగిపోయింది. ధర్మదేవత భయపడి పారిపోతోంది. మంచివారు జీవించలేని పరిస్థితి దాపురిస్తోంది. దుర్మార్గులు పట్టపగ్గాల్లేకుండా వీరవిహారం చేస్తున్నారు. ఎన్నాళ్లీ భయంకర వాతావరణం.. ఏమిటి దారి... ఈ స్థితిలో దుష్టులను శిక్షించి ధర్మాన్ని సంరక్షించి మంచివారిని కాపాడేవాడు లేడా...?
ఎందుకులేడు..? ఇలాంటి సమయాల్లో నేను అవతారాన్ని స్వీకరిస్తానని భగవంతుడే ఇలా స్వయంగా చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి బాధ కలిగి అధర్మం పెచ్చుపెరిగి పోతుందో అప్పుడు నేను ఏదో ఒక అవతారాన్ని పరిగ్రహించి, సాధు జనాన్ని దుర్మార్గుల నుంచి రక్షిస్తాను. దుష్టులను సర్వనాశనం చేస్తాను. ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తాను. భగవంతుడు పూర్ణకాముడు. కనుకనే ఆయనది అవతారం. జీవుడిది జన్మ అవుతుంది.