Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారు పేరు తిండి మెండయ్య...! స్వామివారు భోజన ప్రియుడు.. సగం పగిలిన మట్టిపెంకులోనే భోజనం...

తిరుమల శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణ ఆవరణకు ఎదురుగా ఉన్నదే స్వామివారి ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో శ్రీ స్వామివారి గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయమూలకు శాస్త్రోక్తంగా 3 అడుగుల రాతి అధిష్టానంపై 61 అ

Advertiesment
Tirumala Venkateswara Naivedyam
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (11:33 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణ ఆవరణకు ఎదురుగా ఉన్నదే స్వామివారి ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో శ్రీ స్వామివారి గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయమూలకు శాస్త్రోక్తంగా 3 అడుగుల రాతి అధిష్టానంపై 61 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో అత్యంత విశాలమైన ఎతైన రాతి స్తంభాలతో ఈ వంటశాల నిర్మితమైవుంది. అత్యంత ప్రాచీన కాలం నుంచి ఇదొక్కటే వంటశాల. శ్రీవారికి నివేదనమయ్యే అన్న ప్రసాదాలు, పిండివంటకాలు (లడ్డు, వడ మిగిలినవి) అన్నీ ఈ వంటశాలలోనే తయారు చేసేవారు. నానాటికీ పెరిగిపోతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి నివేదనలు పెరుగుతూ ఉన్నందువల్ల విమాన ప్రదక్షిణంలోని ఈ ప్రాచీన వంటశాలను ప్రస్తుతం ప్రధానంగా అన్న ప్రసాదాలకు గాను వాడుకుంటూ ఉన్నారు. 
 
ఇక పిండివంటలైన లడ్డు, వడ, అప్పం, దోశె, పోళీ, సుఖియ, మురుకు, జిలేబి, తదితర వాటి తయారీకి వెండివాకిలి బయట సంపంగె ప్రదక్షిణంలో ఉత్తరం వైపు ఉన్న మంటపాలను వంటశాలగా ఏర్పాటు చేసి ఇటీవల కాలం నుంచీ ఉపయోగించడం జరుగుతూ ఉంది. సంపెంగ ప్రదక్షిణంలోని పడిపోటు అనే పండివంటశాలను కూడా ఎంతో పురాతనమైనవి.
 
ప్రస్తుతం విమాన ప్రదక్షిణంలోని ఈ ప్రధాన వంటశాలను శ్రీవారి ఆలయ సంప్రదాయంలో పోటు అని పిలువడుతూ ఉన్నది. ఈ వంటశాలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నివేదన చెయ్యబడే అత్యంత రుచికరమైన పాయసాలు, పరమాన్నాలు, నిత్యమూ వండబడుతూ ఉంటాయి. తిరుమలప్పని వైభవానికి వైభోగానికి ప్రధానంగా రెండే రెండు విశేషాలు స్పష్టంగా గోచరిస్తాయి. మిరుమిట్లు గొలుపుతూ ఉన్న అమూల్య రత్నాభరణాలు, ఉత్సవాలు, ఊరేగింపులు మొదటిది కాగా, ఇక రెండవది ఆయన ఆరగించే దివ్యప్రసాదాలు.
 
ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడా, మరెక్కడా ఇంతటి వైభవం వైభోగం కానరాదు. నభూతో నభవిష్యతి అన్న ప్రసిద్ధికి కారణం ఆ తిరుమలేశుని ఎనలేని భక్తి ప్రియత్వమే ప్రధాన కారణం. భక్తులు కోరిన వరాలన్నింటినీ ఇవ్వడం ఆ భక్తులు చెప్పినట్లుగా వినడం చేసినట్లుగా ఉత్సవాలు చేయించుకోవడం వారు పెట్టింది సుష్టుగా ఆరగించడమే శ్రీ వేంకటేశుని తెలిసిన భక్త ప్రియత్వం. ఆలోచిస్తే తిరుమల శ్రీనివాసుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడట. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడట. అందుకే తాను ఏరికోరి ఆరగించిన రుచికరములైన ప్రసాదాలన్నీ భక్తులు తింటేనే ఆయనకు ఆనందమని పురాణాలు చెబుతున్నాయి.
 
తాను తిన్నవన్నీ భక్తులు తింటేనే ఆయనకు ఒక తృప్తి. అసలు భక్తులకు తినిపించడానికే శ్రీ వేంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన పిండివంటల్ని అన్న ప్రసాదాల్ని ఆరగిస్తాడట. ప్రపంచంలో ఈ స్వామిని మించిన నైవేద్య ప్రియుడు భోజన ప్రియుడు మరొకడు కనపడడట. తిరుమల స్వామివారు ఎన్నెన్ని ఆరగిస్తాడో వాటిని ఏకరువు పెట్టలేక తెనాలి రామకృష్ణకవి తిండి మెండయ్య అంటూ ఒక్కమాటలో తిరుమలేశునికి పెద్దబిరుదునే తగిలించినాడట.
 
ఇలా ఇన్ని విధాలుగా ఎంతోమంది చేత పొగడబడిన తిరుమలస్వామి నిత్యమూ తోమని పళ్ళాల్లో ఆరగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తోమని పళ్ళాల్లో ఆరగించే శ్రీ వేంకటేశ్వరుని భోగం ఎంతటిదో కదా. ఆ స్వామి ఒకసారి ఆరగించిన పళ్ళాన్ని మళ్ళీ తోమకుండా పారవేస్తారు. మళ్ళీ భోజనానికి కొత్త పళ్ళెం. మళ్ళీ.. మళ్ళీ.. అదే కొత్తపళ్ళేలు వస్తూ ఉంటాయి. అసలు తోమని పళ్ళేలు అంటే మట్టికుండలు. అది కూడా సగం పగిలిన మట్టి పెంకు. దాన్నే ఓడు అంటారు. అదే ఓటికుండ. భక్తప్రియుడైన శ్రీ వేంకటేశ్వరుడు తాను పగిలిన మట్టి పెంకులో భోజనం చేస్తూ భక్తుల చేత మాత్రం విందారగింపజేస్తూ ఉన్నాడు. భక్తులే తనకు పరమార్థం. భక్తుల ఆనందమే స్వామివారికి ఆనందం. 
 
ఇలా తోమని పళ్ళాల వాడని ప్రసిద్ధి చెందిన శ్రీ స్వామివారికి తరతరాలుగా ఎందరో రాజులు, రారాజులు చక్రవర్తుల దగ్గర నుంచి సామాన్య నిరుపేద భక్తుల దాకా తమ తమ శక్తి కొద్దీ ఎన్నో నివేదనలు చేశారు. ఆరగింపులను చేయించారు. శ్రీ వేంకటేశ్వరుడు భక్తులు సమర్పించిన నివేదనల్ని అత్యంత ప్రియంగా ఆస్వాదించి వాటికి దివ్యత్వాన్ని ప్రసాదించి వాటిని మళ్ళీ భక్తులకే వినియోగింపజేస్తూ ఉన్నాడు. ఇలా తరతరాలుగా ఎందరో భక్తులు తమకిష్టమైన రీతిలో తాము మెచ్చిన రీతిలో వండింపచేసి సమర్పించిన ఇన్ని విధాల ప్రసాదాలను శ్రీ స్వామివారు అత్యంత ప్రియంగా ఆరగించే ప్రసాదాలు అన్నీ శ్రీవారి ఆలయంలో గమేకార్లు అనే బడే వంటవారు సంప్రదాయ బద్ధంగా పోటు అనే ఈ వంటశాలలో వండుతారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం వంటచెరకును ఉపయోగించి కేవలం మట్టి కుండలలో మాత్రమే వంట చేసేవారట. 
 
కాలక్రమేణా వాటి స్థానంలో ఇత్తడి గంగాళాలు చోటుచేసుకున్నాయి. ఇంకా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న లక్షలాది భక్తుల సంఖ్య దృష్ట్యా ప్రస్తుతం గ్యాస్‌ను ఉపయోగిస్తూ శ్రీవారి సిబ్బంది శుచిగా శుభ్రంగా రుచికరంగా అత్యంత భక్తి శ్రద్థలతో వంటలు తయారుచేసి శ్రీవారికి సమర్పిస్తూ ఉన్నారు. వాటిని శ్రీ స్వామివారి చేత ముప్పూటలా సుష్టుగా ఆరగింపజేస్తూ శ్రీవారి వంటవారు ఆనందింపజేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి వంటలు చేస్తూ సమర్పించే వంటవారు పూర్వజన్మ భాగ్యం ఎంతటిదో కదా! ఒకప్పటి మహారాణులైన కౌసల్యాదేవికి, దేవకీదేవికి కూడా తమ చేతులతో వండిపెట్టే భాగ్యం అబ్బి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవాలయంలో పాటించాల్సిన నియమాలు... తులసిని తుంచరాదు... ఇంకా మరిన్ని...