Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...

Advertiesment
Tirumala TTD Brahmotsavam 2020
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (07:43 IST)
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరుగనుంది. ఈ బ్రహ్మోత్సవాలు 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అయితే, కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేలా తితిదే పాలక మండలి ఏర్పాట్లు చేసింది. 
 
ఇదిలావుంటే, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఉత్సవాల అంకురార్పణ జరుగనుంది. ఈ సంద‌ర్భంగా విశ్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో కార్యక్రమం అత్యంత ముఖ్యమైంది. 
 
ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. 
 
అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది. శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.
 
మరోవైపు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి ఏకాంతంగా జరుగుతున్నందున.. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులే కొండకు రావాలని టీటీడీ సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, ప్రముఖుల పర్యటన ఏర్పాట్లపై అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ఆనయ తిరుమలలో సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా గోపినాథ్‌జెట్టి మీడియాతో మాట్లాడుతూ.. పెరటాసి మాసంలో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు తాత్కాలికంగా రద్దయ్యాయని, ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్‌ చేసుకునే తిరుమలకు రావాలని తమిళనాడులోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రముఖుల పర్యటనలో తిరుపతి అర్చన్‌ పోలీసులతో కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. టీటీడీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 49 ఆలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కల్యాణమండపాల వద్ద భద్రతా ఏర్పాట్లపై సమీక్షించామన్నారు. టీటీడీ ఆలయాల్లోని 20 ఆలయాల్లో బంగారు, చెక్కరథాల వద్ద భద్రతకు సిబ్బందికి విధులు కేటాయించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-09-2020 శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని పూజిస్తే సర్వదా శుభం