Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం... 3 నుంచి ప్రారంభం..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల సమయం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం... 3 నుంచి ప్రారంభం..
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:20 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకో వాహనంపై స్వామివారు వూరేగుతూ భక్తులకు దర్సనమివ్వనున్నారు.
 
తిరుమల బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులు, సిబ్బంది సిద్థమయ్యారు. సామాన్య భక్తులకు మంచి వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విచారణ కార్యాలయాలకు ముందు వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి గదులు కేటాయించనున్నారు. ఇందుకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించకుండా స్వయంగా వచ్చిన భక్తులకు అందించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లను నిలిపివేశారు. సామాన్య భక్తులే పరమావధిగా ప్రాధాన్యత ఇవ్వడానికే సిద్ధమయ్యారు. సిఫార్సులపై గదులు కేటాయించే కార్యాలయాలను బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు టిటిడి మూసివేయనుంది.
 
భక్తుల కోసం అన్నప్రసాద వితరణను విస్తృతం చేస్తున్నారు. వైకుంఠంలోని కంపార్టుమెంట్లతో పాటు సర్వదర్సనం, దివ్యదర్శనం క్యూలైన్లలోని భక్తులకు అన్నప్రసాదం సరఫరా చేయనున్నారు. భక్తజనం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా అన్నదానం చేస్తారు. గతం కంటే అదనపు కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క గరుడసేవ పర్వదినాన మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5గంటల వరకు తిరువీధుల్లోని గ్యాలరీలకు అన్నపానీయాలు అందచేయనున్నారు. మజ్జిగ సరఫరాను టిటిడి చేయనుంది. నిత్యఅన్నసముదాయంలో ఉదయం 8 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ప్రసాద వితరణ జరుగనుంది.
 
స్వామివారికి మొదటిరోజే ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3వ తేదీ రాత్రి తిరుమలకు చేరుకుని 7.30 నిమిషాలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయంకు వస్తారు. అక్కడి నుంచి ఊరేగింపుగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి సమర్పిస్తారు. పట్టువస్త్రాల తర్వాత రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనం జరుగనుంది. 
 
గ్యాలరీలను కూడా విస్తరిస్తున్నారు. తిరువీధుల్లో వాహన సేవలను వీక్షించడానికి గతం కంటే గ్యాలరీలను ఎక్కువగా టిటిడి విస్తరించింది. పదివేల మంది భక్తులు అదనంగా వీక్షించే సౌలభ్యం ఉంది. పడమన, తూర్పు మాఢ వీధుల వెంట గ్యాలరీలను విస్తరించారు. తిరువీధుల గ్యాలరీలకు చేరుకోలేని యాత్రికు లకోసం రద్దీ ప్రాంతాల్లో 10 ఎల్‌ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.  
 
అలాగే ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఎన్నో సంవత్సరాల అనుభవాలతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల ముఖద్వారం గరుడాద్రి నగర్‌ టోల్‌గేట్‌ నుంచి రింగు రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు, ఎడమవైపు మార్గంలో ప్రైవేటు వాహనాల ప్రవేశానికి అనుమతిస్తున్నారు. సూచిక బోర్డులు, పోలీసుల నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపడం, నిలబెట్టుకోవడం ద్వారా తిరుగు ప్రయాణం వేళ ఇబ్బంది ఉండదు. వాహనదారులు సహకరించాలని తితిదే ఇప్పటికే సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం నాడు మహాలయ అమావాస్య... ఏం చేయాలి?