సౌందర్యవతి దేహంలో కూడా అవే కదా వుంటాయి... కానీ...
పనులన్నీ చేస్తూ ఉండు. కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలసిమెలసి ఉండు. అందరికి సేవ చేస్తూ వుండు. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరూ నీవారు కారని ఎరిగి ఉండు. ధనవంతుల
పనులన్నీ చేస్తూ ఉండు. కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలసిమెలసి ఉండు. అందరికి సేవ చేస్తూ వుండు. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరూ నీవారు కారని ఎరిగి ఉండు. ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తుంది. కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే ఉంటుంది. పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరిగా పెంచుతుంది. నా రాముడు, మా హరి అని పిలుస్తుంది. కానీ ఆ పిల్లలు తనవారు కారని మనస్సులో ఆమెకు బాగా తెలుసు.
తాబేలు నీటిలో తిరుగాడుతుంటుంది. కాని దాని మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా.. గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు. కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదనే ఉంచు. భగవంతుని పట్ల భక్తిని అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే, ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు. ఆపద, దుఃఖం, శోకాలు ఎదురైనప్పుడు మనస్థైర్యాన్ని కోల్పోతావు.
ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల అనురక్తి పెరుగుతుంది. చేతికి నూనె రాసుకునే పనస తొనలను వొలవాలి. లేకపోతే చేతికి జిగురు అంటుకుంటుంది. భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తరువాతనే సంసారంలో అడుగిడాలి. కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంతవాసం అవసరం. వెన్నను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒకచోట ఉంచాలి. మాటిమాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. ఆ తరువాత ఇతర పనులన్ని వదిలేసి వచ్చి కూర్చొని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్నను తీయగలం.
ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే, ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కాని అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాల చింతనే. సంసారం నీళ్ళ వంటిది. మనస్సు పాల వంటిది. పాలను నీళ్ళలో పోస్తే పాలు, నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చెయ్యలేం. అదే పాలను తోడు పెట్టి, పెరుగు చిలికి వెన్నతీసి ఆ వెన్నను నీళ్ళలో వేస్తే అప్పుడే అది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నని పొందమని చెప్పటం.
ఆ వెన్నను సంసారమనే నీళ్ళలో జారవిడిచినా కలిసిపోదు, తేలుతుంది. దానితోబాటు విచారణ చెయ్యటం ఎంతో అవసరం. కామినీ కాంచనాలు అనిత్యాలు. భగవంతుడొక్కడే నిత్యవస్తువు. ధనంతో ఏం ప్రయోజనం... కూడు, గుడ్డ, నీడ ఇంతవరకే- అంతేకదా.... దాంతో భగవల్లాభం చేకూరదు. అందువల్ల ధనం ఎన్నటికి జీవితోద్దేశం కాజాలదు. ధనంలో ఏముంది, సుందరమైన దేహంలో ఏముంది. విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు, మాంసం, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. మానవుడు ఇలాంటి వస్తువుల మీద మమకారం పెంచుకుని భగవంతుని మీద మనసుని లగ్నం చేయలేకపోతున్నాడు.