Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంగమ్మ తల్లి భూలోకానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసా?

దైవ స్వరూపం గంగానది. గంగను ఇంద్రలోకంలో మందాకినీ అని, పాతాళలోకంలో భోగవతి అని, భూలోకంలో అలకనంద అని అంటారు. దేవనది గంగ భూలోకానికి రావడం వెనుక గొప్ప కథ ఉంది. ఆ కథలో గంగమ్మకు పవిత్ర శక్తి ఉంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. నిస్వార్ధ పితృభక్తి ఉంది

గంగమ్మ తల్లి భూలోకానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసా?
, సోమవారం, 23 ఏప్రియల్ 2018 (19:41 IST)
దైవ స్వరూపం గంగానది. గంగను ఇంద్రలోకంలో మందాకినీ అని, పాతాళలోకంలో భోగవతి అని, భూలోకంలో అలకనంద అని అంటారు. దేవనది గంగ భూలోకానికి రావడం వెనుక గొప్ప కథ ఉంది. ఆ కథలో గంగమ్మకు పవిత్ర శక్తి ఉంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. నిస్వార్ధ పితృభక్తి ఉంది.
 
పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు వైదర్బి, శైబ్య అనే భార్యలు ఉండేవారు. శైబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలని కోరుకుంది. వైదర్బి మాత్రం అరవైవేల మంది బిడ్డలు కలగాలని శివుడిని ఆరాధించింది. శైబ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. కొద్దికాలం తరువాత వైదర్బికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది. అప్పుడామె మళ్లీ పరమేశ్వరుని ఆరాధించడంతో....  కాయ లోపలి గింజలలా ఉన్న అరవైవేల మంది పుత్రులు జన్మించారు. 
 
వారంతా బలపరాక్రమవంతులుగా ఎదిగారు. అయితే పెద్దల మీద గౌరవం, క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు. ఒకసారి సగరుడు అశ్వమేధయాగం చేస్తుండగా యాగాశ్వం కనిపించకుండా పోయింది. అరవైవేల మంది సగరుడు కుమారులు అన్ని చోట్లా వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గుర్రాన్ని దొంగలించాడనుకుని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బందిపెట్టడంతో ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు. 
 
ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదలి అరణ్యాలకి వెళ్లిపోయాడు. అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని బతికించాలని అనుకున్నాడు. స్వర్గంలో ఉన్న గంగానది ఆ బూడిదరాశుల మీదుగా ప్రవహిస్తే వారంతా బతుకుతారని తెలిసి గంగాదేవి కోసం చాలాకాలం పాటు తపస్సు చేసి కన్నుమూశాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు అదే తపస్సును కొనసాగించాడు. కానీ ఆయన వల్ల కూడా కాలేదు. 
 
ఆ తరువాత అతని కుమారుడు భగీరథుడు గోలోక శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు. అయితే గంగాదేవి భాలోకంలో పాపాత్ములు ఎక్కువగా ఉంటారని వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందనీ..... మనసులో ఉన్న సందేహాన్ని కృష్ణుడికి చెప్పింది. 
 
అప్పుడాయన ఎంతమంది పాపాత్ముల పాపం అంటుకున్నా ఒక్క భక్తుడు, మంత్ర ఉపాసకుడు, యోగసాధకుడు గంగలో స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ పోతాయని అన్నాడు. అలాగే పండుగపబ్బాల్లో గంగలో స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలాలు దక్కుతాయని మాటిచ్చాడు. ఆ తరువాత తనే స్వయంగా గంగను పూజించాడు. భగీరథుడు కూడా గంగమ్మను పూజించి భూలోకానికి గంగమ్మ దూకేటప్పుడు ఆమెను భరించే భాద్యతను శివుడికి అప్పగించాడు. భగీరథుని వెంట భూలోకానికి వచ్చింది కనుక భాగీరధి అయ్యింది గంగ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతుడికి మంగళవారం నాడు అలా చేస్తే....?