Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే కాంట్రాక్ట్ పనుల్లో భారీ కుంభకోణం - ఒకే సంస్థకు పగ్గాలు..!

తిరుమల, తిరుపతిలోని తితిదే అద్దె గదులను శుభ్రం చేసే హౌస్ కీపింగ్‌కు సంబంధించి ఇటీవల నిర్వహించిన కాంట్రాక్టులన్నీ పద్మావతి హాస్పిటాలిటి అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అనే సంస్థ దక్కించుకుంది.

తితిదే కాంట్రాక్ట్ పనుల్లో భారీ కుంభకోణం - ఒకే సంస్థకు పగ్గాలు..!
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:06 IST)
తిరుమల, తిరుపతిలోని తితిదే అద్దె గదులను శుభ్రం చేసే హౌస్ కీపింగ్‌కు సంబంధించి ఇటీవల నిర్వహించిన కాంట్రాక్టులన్నీ పద్మావతి హాస్పిటాలిటి అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అనే సంస్థ దక్కించుకుంది. తిరుమలలో నాలుగు ప్యాకేజీలు ఉండగా సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్యాకేజీలు ఆ సంస్థకు టెండర్లు నిర్వహించగా మూడు కాంట్రాక్టులూ పద్మావతికే లభించాయి. ఇక తిరుపతిలోనూ శ్రీనివాసం నిర్వహణ కాంట్రాక్టును పద్మావతి వశమయ్యాయి. రెండేళ్ళ కాలానికి నిర్వహించిన టెండర్లలో మొత్తం రూ.50 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న పద్మావతి ఎఫ్‌‌ఎంఎస్ సంస్థ అధినేత, అధికార పార్టీ పెద్దలకు దగ్గర బంధువు అయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ సంస్థ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారనున్నాయి.
 
తిరుమల సౌత్ ప్యాకేజీలో 2474 గదులున్నాయి. వీటిని రెండేళ్ళు ఆల్ సర్వీసెస్ గ్లోబెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. 2015లో జరిగిన టెండర్లలో రెండేళ్ళకు కలిపి రూ.17.70 కోట్లతో పనులను దక్కించుకుంది. తాజా టెండర్లలో పద్మావతి ఎఫ్‌‌ఎంఎస్ సంస్థ రూ.17.80 కోట్లతో టెండర్లను వశం చేసుకుంది. ప్రస్తుత టెండర్లలో సౌత్ ప్యాకేజీకి ఆల్ సర్వీసెస్ సంస్థ రూ.25.28 కోట్లకు టెండరు చేసింది. ఈస్ట్ ప్యాకేజీ కోసం ఆల్ సర్వీసెస్ సంస్థ రూ.10.55 కోట్లు. కట్ చేస్తే పద్మావతి రూ.9.33 కోట్లు కోట్ చేసి పని దక్కించుకుంది. వెస్ట్ ప్యాకేజీ కోసం ఆల్ సర్వీసెస్ రూ.16.68కోట్లు, పద్మావతి రూ.15.71 కోట్లతో టెండర్లు వేశాయి. దాదాపు కోటి తక్కువగా వేసిన పద్మావతికి పని దక్కింది. 
 
తిరుపతిలోని పద్మావతి, శ్వేతనిర్వహణ పనులను పద్మావతి రూ.9.97 కోట్లతో దక్కించుకుంది. ఇదే పనికి ఆల్ సర్వీసెస్ సంస్థ రూ.11.22 కోట్లు టెండరు వేసింది. అంటే కోటి రూ.26 లక్షలు తేడా ఉంది. పద్మావతి వేసిన రేట్లు చేస్తే రెండేళ్ళ క్రితం ఆల్ సర్వీసెస్ సంస్థ వేసిన వాటికంటే తక్కువగా ఉన్నాయి. పనులు దక్కించుకున్న సంస్థలు వేసిన వాటికంటే తక్కువగా ఉన్నాయి. పనులు దక్కించుకున్న సంస్థలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పెరిగే డిఏ అమలు చేయాలి. బస్ పాస్ సదుపాయం కల్పించాలి. గదుల శుభ్రం చేయడానికి అవసరమయ్యే రసాయనాలు సమకూర్చుకోవాలి. రెండేళ్ల క్రితం రేట్ల కంటే తక్కువతో పనులు చేపట్టే పద్మావతి ఎలా నిర్వహిస్తుందే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
 
ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కొందరినికి తొలగించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్ళు బలంగానే అవకాశాలూ లేకపోలేదు. ఇలాంటి అనుభవాలు శ్రీకాళహస్తి, కాణిపాకంలో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నింటిలోనూ పద్మావతి ఎఫ్‌‌ఎంఎస్‌ సంస్థ హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. మన జిల్లాకు సంబంధించి కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ కాంట్రాక్టు చేస్తోంది. ఈ సంస్థ పనిచేపట్టిన తర్వాత తమను తొలగించారంటూ కొందరు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటిదాకా తిరుమలలో పనిచేస్తున్న సంస్థలు ఎక్కడో ముంబై, బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు చెందినవి. పద్మావతి మాత్రం స్థానిక సంస్థ. అందుకే తితిదే ఉద్యోగాలు కావాలని పద్మావతిపై ఒత్తిడి చేసేవాళ్ళు ఎక్కువగా ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పనిచేసే వారిని తొలగించి ఆ స్థానంలో తమవారిని నియమించుకునేందుకు ప్రయత్నించవచ్చని కార్మికులు భయపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా చేయవద్దని కోరుతున్నారు. తక్కువ టెండర్ దక్కించుకున్నా ఇప్పటిదాకా పనిచేస్తున్న కార్మికులను తొలగించకుండా చూడాల్సిన బాధ్యత టిటిడి ఉన్నతాధికారులపై ఉంది. 
 
ఒకప్పుడు టెండరు కండిషన్‌లోనే ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులను పనికి వినియోగిస్తున్నారో చెప్పాల్సి ఉండేది. వర్క్ కాంట్రాక్టర్‌గా మార్చిన తర్వాత ఎంతమంది కార్మికులతో పని చేయిస్తారనేది తితిదేకి సంబంధం లేదు. నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం పని చేస్తున్నారా లేదా అనేది మాత్రమే టిటిడి చేస్తోంది. దీనివల్ల ఎక్కువ మందితో చేయాల్సిన పనిని తక్కువ మందితో చేయించి, సంస్థలు డబ్బులు మిగుల్చుకోవడానికి ప్రయత్నిస్తామని, వర్క్ కాంట్రాక్టు పద్దతి తీసుకురావద్దని అప్పట్లోనే కార్మికులు ఆందోళన చేశారు. 
 
అయినా టిటిడి పట్టించుకోలేదు. అసంబద్ధ వర్క్ కాంట్రాక్టు పద్దతిని అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనను లొసుగుగా తీసుకుని కార్మికులను తగ్గించినా, ఉన్నవారిని తొలగించి కొత్తవారిని నియమించుకున్నా టిటిడిలో అలజడి మొదలయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారంతా స్థానికులే.. పద్మావతి సంస్థ కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?