స్వామి వివేకానంద ఓ యోగి.. సన్యాసి. గొప్ప వక్త, ఉద్వేగభరితమైన దేశభక్తుడు. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో దిట్ట. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. రామకృష్ణ మఠము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి భారత సర్కారు ఉత్తమ సేవా సంస్థగా ఎంపిక చేసి, కోటి రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించింది.
ప్రపంచ వేదికపై హిందూ మతాన్ని గౌరవనీయమైన మతంగా స్థాపించాడు వివేకానంద. అతని మాటలు దేశంలోని యువతకు స్వీయ-అభివృద్ధి లక్ష్యాలుగా మారాయి. అందుకే ఆయన జన్మదినమైన జనవరి 12ని భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద అమృత వాక్కులు నిత్యసత్యములు. గురువంటే రామకృష్ణుడు. శిష్యుడంటే వివేకానందుడు అని చెప్పే స్థాయిలో నిలిచారు.
కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, జతిన్‌దాస్‌లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే బాటలుగా మారాయి.
సంపన్న బెంగాలీ కుటుంబంలో నరేంద్రనాథ్ దత్తా జన్మించారు. విశ్వనాథ్ దత్తా- భువనేశ్వరి దేవి దంపతుల ఎనిమిది మంది పిల్లలలో వివేకానంద ఒకరు. ఆయన జనవరి 12, 1863న సందర్భంగా జన్మించారు. తండ్రి విశ్వనాథ్ సమాజంలో గణనీయమైన ప్రభావంతో విజయవంతమైన న్యాయవాది.
నరేంద్రనాథ్ తల్లి భువనేశ్వరి దృఢమైన, దైవభీతి గల మనస్సు కలిగిన స్త్రీ, ఆమె తన కొడుకుపై గొప్ప ప్రభావాన్ని చూపించింది. చదువుతో పాటు అన్నీ రంగల్లో నరేంద్రనాథ్ రాణించారు. ఆపై ఆధ్యాత్మిక పరిశీలన చేశారు. భగవంతుని కోసం తన మేధో తపనను సంతృప్తి పరచడానికి, నరేంద్రనాథ్ అన్ని మతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక నాయకులను సందర్శించి, మీరు దేవుడిని చూశారా? అని ఒకే ప్రశ్న అడిగారు. అయితే తృప్తినిచ్చే సమాధానం రాలేదు. ఆపై సన్యాసి జీవన విధానానికి ఆకర్షితుడయ్యారు. పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
వివేకానంద కోట్స్
ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యతగా వ్యవహరించు. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.
పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.
మనలొ ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదు నిమిషాలు పని చేయలేం. ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడుతుంటాడు అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతుంది.