"విశ్వంలో సర్వశక్తులు మన గుప్పెట్లో ఉన్నాయి. అది తెలియక అంధకారంలో ఉన్నామని అనుకుంటున్నాం" అని మానవ శక్తిని లోకానికి ఏనాడో తెలియచెప్పిన స్వామి వివేకానంద బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు.
ఆయన తన స్వీయచరిత్రలో పేర్కొన్న కొన్ని అంశాలు ఆయన మాటల్లోనే... "మా తాతగారి పేరు దుర్గాచరణుడు. ఆయన కలకత్తాలో నివసించేవాడు. సంస్కృత భాషలోనే మహాపండితుడు మాత్రమే గాక గొప్ప న్యాయ శాస్త్రవేత్త కూడా. బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ఆయనకు డబ్బు మీద ఆశలేనందున చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించాడు." అని వివేకానంద తెలిపారు.
"ఆయన కుమారుడు విశ్వనాధుడే మా తండ్రి గారు. మా బామ్మగారు ఓ రోజు మా తండ్రిగారిని తీసుకుని కాశికి బయల్దేరింది. ఆ రోజుల్లో రైళ్లు లేనందున వారు గంగానదిలో పడవపై ప్రయాణమయ్యారు.
ఆ పడవలో వెళ్తుండగా మా తండ్రిగారు కాలు జారి నదిలో పడిపోయాడు. దాంతో మా బామ్మగారు బోరుమని విలపిస్తూ గంగలో దూకింది. అయితే ఆ పడవలో ఉన్నవారు అతి కష్టంపై వారిని ఒడ్డుకు చేర్చారు.
దర్శనమైన తర్వాత తిరుగు ప్రయాణంలో మా బామ్మగారు తెలివి తప్పి పడిపోయారు. ఇంతలో ఓ సన్యాసి వచ్చి ఆమె మొహంపై కాస్త నీళ్లు చల్లి, త్రాగించాడు. ఆమెకు స్పృహ వచ్చి చూస్తే ఆయన ఎవరో కాదు మా తాత గారు - దుర్గాచరణుడే! ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి. "హా మాయ మహామాయ" అంటూ మాయమయ్యాడు." అని వివేకానంద తన స్వీయ చరిత్రలో పేర్కొన్నారు.
"మా ఊర్లో జరిగే ఉత్సవాలంటే నాకు చాలా ఇష్టం. నేను తప్పుకుండా ఆ ఉత్సవాల సమయంలో ఊరికి వెళ్లేవాడ్ని. ఎప్పట్లాగే ఆ సంవత్సరం కూడా నేను నా మిత్రబృందంతో ఆ ఉత్సవాలకోసం బయలుదేరాను. అక్కడ అంతా కోలాహలంగా ఉంది. తినుబండారాల దుకాణాలు, రంగురంగుల రాట్నాలు, అందమైన దుస్తులు, బొమ్మలతో బజారంతా కళకళలాడిపోతోంది." అని వివేకానందుడు తన ఇష్టాలను వివరించారు.
"నా మిత్రులంతా వాళ్లకు నచ్చినవి వాళ్లు కొనుక్కున్నారు. కాని ఓ శివుడి బొమ్మ మాత్రం నన్ను ఆకర్షించింది. ఇష్టమైన బొమ్మను చేతపట్టుకుని ఇంటికి వస్తూంటే ఓ బాలుడు గుర్రపుబండి కింద పడబోతూ కన్పించాడు. అక్కడ ఉన్న జనం చూస్తూ నిలబడ్డారే తప్ప కాపాడాలని ప్రయత్నించలేదు. నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బొమ్మను సైతం వదిలేసి ఆ బాలుని కాపాడాను.
ఆ బాలుని కళ్లలోని ఆనందం ముందు నేను కొన్న పరమేశ్వరుని బొమ్మ కనిపించలేదు. అతనిని కాపాడగలిగానన్న తృప్తి నాకు చాలా సంతోషం కలిగించింది. నాకు పదేళ్ల వయసులో మరోసారి మా మిత్ర బృందమంతా జంతు ప్రదర్శనశాలకు బయలుదేరాం. అప్పుడు బస్సులు లేనందున పడవలోనే వెళ్లాలి. మేము ఉల్లాసంగా అంతా తిరిగి చూశాం.
తిరుగు ప్రయాణంలో మాలో ఒకడికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీని వలన పడవంతా నాశనమయింది. దాంతో పడవ వారు మమ్మల్ని పడవను శుభ్రం చేయమన్నారు. మేము అందుకు ఎక్కువ డబ్బిస్తామన్నాం. కుదరదన్నారు. పడవను శుభ్రం చేయకుండా కిందికి దిగనివ్వమన్నారు.
ఇంతలో నావ ఒడ్డుకు చేరువయ్యింది. ఒడ్డు మీద తెల్ల సిపాయిలు కనిపించారు. తెల్ల సిపాయిలంటే ఆ కాలంలో యమ కింకరుల్లాంటి వారు. వారిని చూస్తే అందరికీ హడలు. నేను నావ దూకి వెళ్లి వచ్చీ రాని ఆంగ్లంలో వారికి జరిగిందంతా చెప్పాను. ఇది చూడగానే పడవ సిబ్బంది మరో మాట మాట్లాడకుండా మా మిత్రులను దించేసి వెళ్లి పోయారు." అని వివేకానంద తన స్వీయ చరిత్రలో వివరించారు.