వేంకటేశ్వర స్వామివారు విష్ణువు యొక్క కలియుగ అవతారముగా భావించబడే హిందూ దేవుడు. ఇక్కడ స్వామివారి పేరు వివరణ ఏంటంటే.. వేం - పాపాలు, కట - తొలగించే, ఈశ్వరుడు - దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు.
కలియుగ రక్షణార్థం క్రతువు:
ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయనిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి.. అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి.. ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగనాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెళ్ళుతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.
సత్యలోకం:
మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేతబట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించి బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.
కైలాసం:
బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతుల ఆనంత తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.
వైకుంఠం:
ఇక్కడి నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటారు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి ఓ మహర్షీ మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయూంటాయో.. అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు.
అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాంగలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుమ సంపూర్ణుడిగా గ్రహించారు. కానీ, తన నివాసస్థలమైన వక్ష స్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మీ లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యారు.