Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 25న శ్రీ శార్వరి నామ ఉగాది... ఏం చేయాలంటే?

మార్చి 25న శ్రీ శార్వరి నామ ఉగాది... ఏం చేయాలంటే?
, గురువారం, 19 మార్చి 2020 (20:37 IST)
శ్రీ శార్వరి నామ ఉగాది మార్చి 25. ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు.
 
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
 
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం" అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారుచేసే పద్ధతిలో ఉప్పు'వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవారు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక హిందూ పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
 
ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటుచేసుకుంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి పానీయం సేవించడాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ కల్లోలం... మానవ పతనమే కలి వ్యూహం, మేల్కొనండి