Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే మీకోసం 1000 అడుగులు వేస్తాడు...

Advertiesment
ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే మీకోసం 1000 అడుగులు వేస్తాడు...
, మంగళవారం, 8 జనవరి 2019 (21:42 IST)
మానవుడు నిత్య జీవితంలో తన మానవ జన్మను ఎలా సార్ధకం చేసుకోవాలో, తోటివారితో ఎలా ప్రవర్తించాలో, తల్లిదండ్రులను, గురువులను ఎలా గౌరవించాలో, దేవుని పట్ల భక్తిశ్రద్దలతో ఎలా మెలగాలో తెలుసుకొని జీవితాన్ని కొనసాగిస్తే ఆ జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటాయి. అలా ప్రవర్తించాలి అంటే బాబా చెప్పిన కొన్ని సత్యాలను మన నిత్య జీవితంలో తప్పనిసరిగా అనుసరించాలి. అవి ఏమిటంటే...
 
మీరు ఎవర్నీ నొప్పించకూడదు. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయడానికే ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. 
 
సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పనిచేసినా శ్రద్ధగా చేయాలి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించాలి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకోడదు. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకుండా, ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోవాలి.
 
ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించవద్దు. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండటం మంచిది. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలోను నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. 
 
మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మడం వలన  దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు. దేవుడి వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి 1000 అడుగులు ముందుకు వేస్తాడు అన్నది అక్షరసత్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివజ్ఞాన సాధనం.. రుద్రాక్షధారణం..?