Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ లేడి కోసం తెల్లవార్లు చెట్టుపై కూర్చున్న బోయవాడు... పరమేశ్వరుడు ఏం చేశాడంటే?

ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క రూపమున వెలసిన పరమేశ్వరుడు ఆయా క్షేత్రములలో అద్భుతములు చేస్తాడు. ఆ పరమేశ్వరుని లీలలు చెప్పనలవిగానివి. ఎంతోమంది ఆర్తుల బాధలను తీరుస్తూ వారికి భక్తి, శ్రద్ధలను కలుగచేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఒక బోయవాడు వేటకు బయలుదేరాడు. సూర్యో

ఆ లేడి కోసం తెల్లవార్లు చెట్టుపై కూర్చున్న బోయవాడు... పరమేశ్వరుడు ఏం చేశాడంటే?
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (20:17 IST)
ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క రూపమున వెలసిన పరమేశ్వరుడు ఆయా క్షేత్రములలో అద్భుతములు చేస్తాడు. ఆ పరమేశ్వరుని లీలలు చెప్పనలవిగానివి. ఎంతోమంది ఆర్తుల బాధలను తీరుస్తూ వారికి భక్తి, శ్రద్ధలను కలుగచేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఒక బోయవాడు వేటకు బయలుదేరాడు. సూర్యోదయము నుండి సూర్యస్తమయము వరకు వెదకినను వేట లభించలేదు. అతడు వేటాడి ఇంటికి వెళ్తేనే కాని అతని కుటుంబానికి భుక్తి జరుగదు.
 
రాత్రి ఒక జాము గడిచిన తర్వాత ఒక లేడిపిల్ల అతని సమీపంలో కనిపించింది. ప్రాణాలు లేచివచ్చిన బోయవాడు బాణము సంధించేలోపే ఆ మృగము మనుష్య భాషలో ఇలా అంది. అయ్యా.. నేను కడు చిన్నదానను. కొంచెం సేపటిలో మా తల్లి ఇటు వస్తుంది. దానిని వేటాడిన నీ కుటుంబానికి కడుపు నిండును. నన్ను చంపిన మీ కుటుంబానికి ఆహారముగా సరిపోదు అని బోయవానిని బ్రతిమాలింది. జాలి చెందిన బోయవాడు దానిని చంపక వదిలి పెట్టాడు. 
 
మరలా బోయవాడు వేటకై నిరీక్షింపసాగాడు. రెండవ జాము జరుగు వేళలో పూర్ణ గర్భిణియైన జింక వచ్చింది. బోయవాడు బాణము సంధించాడు. అయ్యా... నేను పూర్ణగర్భిణిని, తెల్లవారులోగా నాకు ప్రసవము జరుగుతుంది. నా గర్భమున ఉన్న శిశువును చంపకూడదు. అది మహా పాపము. కాబట్టి నాకోసం వేచియుండు. నేను వచ్చెదను అని మాట ఇచ్చింది. ఇదేదో చిత్రంగా ఉన్నదే అని బోయవాడు సమీపమున ఉన్న ఒక వృక్షమును ఎక్కి కూర్చున్నాడు. అతడికి నిద్ర రాకుండా ఉండేందుకు ఆ వృక్ష దళాలను ఒక్కొక్కటి తుంచి ఆ చెట్టు తొర్రలో వేయసాగాడు.
 
అట్లా చాలా సమయము గడిచింది. తెల్లవారేసరికల్లా అప్పుడే ప్రసవమైన లేడి తిరిగి బోయవాని దగ్గరకు వచ్చింది. బోయవాడు ఎంతో ఆశతో బాణమును సంధించబోయాడు. అప్పుడు ఆ లేడి అయ్యా... నా కొరకు రాత్రంతా మేలుకొన్నావు. మేలుకున్నవాడివి ఊరుకొనక రాత్రంతా మారేడు దళాలు త్రుంచినావు. త్రుంచిన దళాలను తొర్రలో వేయగా, తొర్రలో ఉన్న శివలింగంపై పడి పూజ చేసిన పుణ్యం దక్కింది. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం. రాత్రంతా జాగరణ చేసి, శివపూజ చేసి పుణ్యం చేసుకున్నావు. ఇంతటి పుణ్యమూర్తివి జీవహింస చేయటమెందుకు అని మాయమైంది ఆ లేడి. అప్రయత్నంగా పుణ్యము నార్జించుకున్న బోయవాడు శివ సాయుజ్యాన్ని పొందాడు. ఏ రీతిగా సేవించినా ఆ భోళాశంకరుడు కోరిన వరాలను ఇస్తూ జనులను సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ''ఏడు'' అనే సంఖ్యకు సంబంధం వుందా?