Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు

ఆశ లేని జీవితం గింజ కట్టని పొల్లు వెన్ను లాంటిది. అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడే వారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే

Advertiesment
అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (21:52 IST)
ఆశ లేని జీవితం గింజ కట్టని పొల్లు వెన్ను లాంటిది. అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడే వారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే అయినా పోటీపడటం మానరు. గెలవలేమేమో అనే నిరాశ వారిలో తలెత్తనే కూడదు. అలాగే అర్హత, స్థాయి, స్థోమత లేని వాటికోసం ఆశ పడటం అనర్ధదాయకం. ఆశకు అంతుండదంటారు అనుభవజ్ఞులు. అనంతమైన ఆశ తన వెంట పడే వారిని పరుగులు పెట్టిస్తుంది. 
 
పరుగెత్తేకొద్దీ తీరిక లేకుండా చేసి ఇంకా తనవైపు ఆకర్షితుల్ని చేయడం దాని లక్షణం. ఆశించింది దొరికితే మరికొంత కావాలని మనిషి కోరుకుంటాడు. అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు. అంతేతప్ప ఇక్కడితో ఆగుదాము అనుకోడు. ప్రమిదలో వత్తి లాంటిది ఆశ. అది ఉండేంతవరకు చమురు పోస్తే వెలుగునిస్తుంది. మునిగేంతగా పోస్తే, చీకటినే మిగుల్చుతుంది. ఆశ మనిషికి లోబడి ఉండాలి. కానీ మనిషి ఆశకు లోబడిపోకూడదు. ఆశ లేనివారికి దుఃఖ బాధలుండవు. ఆశ పడే వారికి లేని బాధ లుండవు. 
 
తమకున్నదానితో సంతృప్తి పడేవారు సంతోషం చవిచూస్తారు. అలా కానివారు కోల్పోతారు. అవగాహన, ప్రణాళిక, పట్టుదల, తగిన కృషి ఉంటే ఆశలు వాటంతట అవే నెరవేరతాయి. ఆశ అనేక రూపాలలో ఉంటుంది. మనిషి నిరాశ, అత్యాశ, దురాశల్లో కూరుకుపోవడం మంచిది కాదు. నిరాశ అతణ్ని నిర్వీర్యుడిగా చేస్తుంది. నిరాశ ఉందని గుర్తించిన తర్వాత ఏదో ఒక విధంగా దానిని తొలగించుకోవాలి. ఆ స్థానంలో ఆశావహ దృక్పధం పెంచుకోవాలి. 
 
అత్యాశ కలిగిన వాళ్లు సుఖసంతోషాలకు దూరమవుతారు. దురాశ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చెడు ఆశల మూలాన వాటిల్లే అనర్ధాలకు విరుగుడు లేదు. లోకంలో అసంతృప్తికి మించిన దారిద్ర్యం లేదు. సంతృప్తిపరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు.  ఆశలు మనసులో ఉండాలి. వాటిని నెరవేర్చుకునే ఆలోచనలు మెదడులో ఉండాలి. వాటిని ఫలవంతం చేసుకునే కృషి, మనిషి చేతుల్లో ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిబాబాకు విష్ణు సహస్ర నామ పారాయణకు సంబంధం ఏంటి?