రామాయణంలో శబరి అంటే తెలియనివారుండరు. శబరి గొప్ప రామ భక్తురాలు. ఆమె తన గురువులకు సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. మునులు చెప్పిన విషయాలు నేర్చుకుంటూ సేవ చేస్తూండేది. రాముడు అరణ్య వాసానికి వచ్చిన విషయం మతంగ ముని శిష్యులకు తెలుస్తుంది. వాళ్లు ఆ విషయం శబరికి చెబుతారు. దాంతో శబరి రాముడి కోసం దాదాపు పదమూడేళ్ల పాటు రాముడి కోసం ఎదురు చూస్తుంది.
అయితే శ్రీరామచంద్రుడు శబరి ఎంగిలి తినడం చాలా గొప్ప విషయమే. శబరి చిన్నప్పటి నుంచి పంపానది సమీపంలో ఉండే మతంగ ముని ఆశ్రమంలోనే ఉండేది. ఆ ఆశ్రమం తప్ప ఆమెకు మరో లోకం తెలియదు. అయితే ఆశ్రమంలో మునులంతా నిత్యం రాముడి గురించే మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఆమెకు రాముడిపై విపరీతమైన భక్తి భావం పెరిగింది.
రాముడు స్వయంగా విష్ణువు అని తెలుసుకుంది. రాముడు ఎంత పెద్ద వీరుడో, ఎంత దయార్ద హృదయుడో ఆమెకు మునులు చెప్పారు. అందుకే రాముని కోసం ఆమె అన్ని సంవత్సరాలు వేచి చూస్తుంది. జీవితంలో ఒక్కసారి రాముడిని చూసి చనిపోతే చాలు అనుకుంది శబరి. తన గురువు అయిన మతంగుడు ముసలివాడు అయిపోయి చివరకు అతను స్వర్గానికి వెళ్లిపోతాడు. అయితే ఎప్పటికైనా రాముడు వస్తాడు ఆశ్రమం దగ్గరే ఉండు అని శబరికి చెబుతాడు.
రోజూ రామనామంతో రాముడి కోసం వేచి చూసింది. వయస్సు పైబడిపోయింది. ఒంట్లో సత్తువ పోయింది. అయినా రామనామాన్ని ఆమె ఆపలేదు. శబరి గురించి రాముడికి తెలిసింది. తన భక్తురాలిని చూడాలని బయల్దేరాడు. చివరకు రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఆనందానికి అవధులుండవు. తన ఆశ్రమానికి వచ్చిన స్వామికి సేవ చేయాలనుకుంటుంది. రాముడి కాళ్లు కడుగుతుంది. పూలతో ఆశ్రమంలోకి ఆహ్వానిస్తుంది.
ఇక తాను తీసుకొచ్చిన రేగు పళ్లను రామునికి తినడానికి ఇద్దామనుకున్నది. అయితే అవి పుల్లగా ఉంటే కష్టము అనుకున్నది. అందువలన వాటిని కొరికి రుచి చూసింది. తరువాత రామునికి తినడానికి ఇచ్చింది. రాముడు ఆ ఎంగిలి పండ్లను కూడా ఇష్టంగా తిన్నాడు. భక్తులు ప్రేమతో ఇచ్చే వాటిలో ఉండే మాధుర్యం ఇంకెందులోనూ ఉండదని రాముడికి తెలుసు. రాముని రూపాన్ని ఎంతో ప్రేమగా చూసింది శబరి. ఈ జన్మకు తనకిది చాలనుకున్నది. తరువాత రాముని వల్ల శబరికి మోక్షం లభించింది.