నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది అని షిరిడీ సాయి చెప్పారు. అదే మనకు బలాన్నిస్తుంది. యోచించడానికి సహకరిస్తుంది. నువ్వు కుక్కను కొడితే నాకు తగులుతుందిరా అని బాబా చెప్పారనుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మనసుకు ఎక్కదు. అందరిలో ఒకే తత్త్వం వుంది. పంచభూతాలు చూస్తే ఒకటే, మనసు చూస్తే ఒకటే, ఆత్మ ఒకటే, అందరిలో ఒకటే వుంది.
ఇక వేరు అనేది ఎక్కడ వుంది అని ఇలా ఎంతసేపు చెప్పినా కూడా అర్థంకాదు. అలాకాకుండా కుక్కను కొడితే ఆయనకు తగిలిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అందుకని సాయి మనకు ఒకప్రక్క అనుభవిస్తున్నాడు, మరోవైపు యోచించమనీ చెపుతున్నాడు. ఈ రెండింటినీ కొనసాగించుకోమనీ చెబుతున్నాడు. కానీ ఈ రెండింటినీ యివ్వవలసిందీ, విడివిడిగా అన్వయించి చెప్పవలసిందీ కూడా సద్గురువే.