శిరిడీ సాయి అవతారము ఎంత విశిష్టమైనదంటే?

గురువారం, 18 అక్టోబరు 2018 (21:04 IST)
శిరిడీ సాయి అవతారము చాలా విశిష్టమైనది. ఆయన చరిత్ర ఆద్యంతం. అత్యంత ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. సర్వసాధారణమైన ఘట్టాలతో నిండి ఉండి ప్రతి ఒక్క లీలయందు ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలు అంతర్గతంగా ఉండటం నిజానికి సాయి దత్తాత్రేయ స్వామి అని మూలగురువని చెప్పకనే చెబుతాయి.
 
చాంద్ పాటిల్ తన గుర్రాన్ని పోగొట్టుకొని కొద్ది దినాలుగా దానిని వెతుకుతూ అన్ని ప్రదేశాలు తిరుగుతుంటాడు. ఒకచోట ఫకీరు రూపంలో ఉన్న సాయిని కలుసుకుంటాడు. ఆయన చాంద్ పాటిల్‌ను ప్రశ్నించడం, తన గుర్రము విషయమై అన్వేషిస్తున్నానని ఆయనతో చెప్పడం ఇత్యాదితో ఆలీల ముగుస్తుంది. చాంద్ పాటిల్ గుర్రమును తీసుకొని సంతోషంగా సాయిని తమ గ్రామానికి ఆహ్వానించి  తీసుకువెళ్లిపోతాడు.
 
మామూలుగా ఒక తప్పిపోయిన గుర్రాన్ని ఆయన తిరిగి దొరికే విధంగా చేయటం అనేది చాలా గొప్ప మహత్యం. మనస్సు అనేది ఒక రౌతు. కోరికలు గుర్రాలు. ఇక్కడ ప్రతి మానవుడు ఒక చాంద్ పాటిల్. అతని మనస్సు కోరికలనే ఎండమావుల వేటలో పడి దిక్కుతోచకుండా పరిగెడుతూ స్థిరం లేకుండా తిరుగుతూ ఉంది. దానికి ఒక కళ్లెము వేయుటకుగాను ఒక నిపుణుడు అనగా సరైన గురువు కావాలి. సరిగ్గా అదే సమయానికి అతను సాయి అనే సద్గురువుని కలిశాడు. సద్గురువు సంకల్పమాత్రంచే భావాలను సరిచేసి జ్ఞానోదయాన్ని కలిగిస్తారు. ఇక్కడ శ్రీసాయి కూడా అదే చేశారు. 
 
తమ మాట మాత్రం చేత గుర్రాన్ని రప్పించారు. చాంద్ పాటిల్ మనస్సు అనే గుర్రానికి కళ్లెం వేసి, సద్గురు చరణాలపై దృష్టిని కేంద్రీకరించేలా చేశారు సాయి. కళ్లెం పడిన గుర్రానికి దారి తప్పడం అనేది ఉండదు. లౌకిక మార్గం నుండి సద్గురువు మనలకు కళ్లెం వేసి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తారు. ఒకసారి దారి దొరికిన తర్వాత మరల తప్పుడు దారికి వెళ్లటం అనేది అసాధ్యం.
 
గుర్రం దొరికిన తర్వాత సాయి చిలుమును తయారుచేసారు. నిప్పు, నీరులను ఒకే ప్రదేశంలో సృష్టించారు. ఇక్కడ అగ్ని, జలము ఇవన్నీ మానవ శరీరంలో అంతర్భాగములని , జీవుడు శరీర త్యాగం చేయు సమయంలో అవి వాటిలో లీనమైపోతాయని ఈ లీల యెుక్క అంతరార్ధం.
 
చిలుము మట్టితో తయారైన ఒక గొట్టం. దానిలో.... ఖాళీ. దానిలో పొగాకు అనే దాన్ని నింపి, జలముతో తడిపి, అగ్నితో ప్రజ్వరిల్లచేసి చివరికి పొగ రూపంగా విడుదల చేయటం .. ఇదేవిధంగా మానవ శరీరంలో అంతర్గతంగా ఉన్నఆత్మకర్మలు, కర్మ ఫలితాలు అనే వాటికి సాక్షిగా వుండి చూసి శరీరత్యాగము చేసి వెళ్లిపోతుంది. ఇందులో మండుతున్నప్పుడుగాని, తడిసినప్పుడు గాని, లేదా తనని ఆస్వాదిస్తున్నప్పుడు గాని అందులోఉన్న పొగాకు తనకేమి సంబంధం లేనట్లుగా, నిర్లిప్తంగా ఉండిపోతుంది. అదేవిధంగా సాంసారిక విషయాలపట్ల నిరాశక్తులుగా ఉండాలి.
 
ఆ విధంగా ఉన్న గురువు యెుక్క అనుగ్రహం వలన లోకకళ్యాణం జరుగుతుంది అనేది అందరికి తెలియచెప్పడానికి సాయివారితో కలసి శిరిడీ గ్రామానికి వివాహమనే మిషతో వచ్చారు. సాయి తోడు ఉంటే కళ్యాణమే గాక పరమాత్మ దర్శనము కూడా అవుతుందని తెలియచెప్పడమే ఖండోబా ఆలయ దర్శనం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 18-10-2018 గురువారం దినఫలాలు - మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా....