Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడకదారి లడ్డూల అక్రమాలకు అడ్డుకట్ట పడింది... ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి!

Advertiesment
Pedestrian Path to Tirumala
, శుక్రవారం, 6 జనవరి 2017 (14:31 IST)
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అత్యంత కష్టంగా ఓర్చి స్వామి నిలయానికి వచ్చే భక్తులకు కానుకగా ఇచ్చే ఉచిత లడ్డూలను అక్రమంగా తరలిస్తున్న దళారులకు తితిదే అడ్డుకట్ట వేసింది. ఇకపై నడకదారిలో వచ్చే భక్తులకు ఆధార్‌ వంటి గుర్తింపుకార్డును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటిదాకా సాగిన దందా ఆగిపోక తప్పదు. తితిదేకి లక్షల రూపాయలు ఆదా చేసే ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇటు అలిపిరి, అటు శ్రీవారిమెట్టు మార్గాల్లో తిరుమలకు నడిచివచ్చే భక్తులకు దర్శనం టోకెన్‌, ఉచిత లడ్డూ టోకెన్‌ ఇస్తారు. ఇందుకోసం కాలినడక భక్తుల కోసం అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద టోకెన్‌ కౌంటర్లు ఉన్నాయి. అయితే ఈ కౌంటర్ల నుంచి టోకెన్లు అక్రమంగా తరలిపోయేవి. ప్రతి భక్తుని వేలిముద్రలు, ఫోటో తీసుకుని టోకెన్‌ ఇస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరువయ్య దశలో మెట్లపైనే ఆ టోకన్లపై సీలు వేస్తారు. ఇదీ పద్ధతి. 
 
అయితే కొందరు వేలిముద్రలు వేయడంలో, ఫోటోలు తీయడంతో హస్తలాఘవం ప్రదర్శించి అవసరమైనన్ని టోకెన్లు తెచ్చుకునేవారు. మెట్ల మార్గంలో ఉచిత లడ్డూ వితరణ కేంద్రానికి వెళ్ళి లడ్డూ తీసుకునే అవకాశం ఉండేది. దీన్నే ఆసారాగా చేసుకుని అక్రమ దందా కొనసాగించేవారు. ఈ పద్ధతుల్లో రోజూ వందల లడ్డూలు అక్రమంగా తరలిపోయేవి. ప్రధానంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఈ దందా పెద్ద ఎత్తున జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
 
ఇక కాలినడకన వచ్చే భక్తులు.. టోకెన్‌ ఇచ్చే కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటర్‌ గుర్తింపు కార్డు ఏదో ఒకటి చూపించాలి. టోకెన్‌లో ఆ నెంబర్‌ నమోదవుతుంది. ఇప్పటికే గదుల బుకింగ్‌, అంగప్రదక్షిణం టోకెన్లు జారీ, శ్రీవారి సేవకుల నమోదు కోసం ఆధార్‌ కార్డును స్వీకరిస్తారు. ఇదే విధానాన్ని విద్యదర్శనం భక్తులకు కూడా అమలు చేయాలని తితిదే నిర్ణయించింది. ఇప్పటిదాకా ఉన్న వేలిముద్రలు, ఫోటో పద్దతిని రద్దు చేశారు. ఈ మార్పు వల్ల అక్రమాలకు పూర్తిగా బ్రేక్‌ పడుతుందనడంలో సందేహం లేదు.
 
గతంలో ఒకే భక్తున్ని కొంచెం అటూ ఇటూ నిలబెట్టడం, వేలిని అటూ ఇటూ జరపడం ద్వారా టోకెన్లు తీసుకునేవారు. ఆ టోకెన్లలో ఫోటో ఉన్నప్పటికీ మనిషిని గుర్తించడం కూడా కష్టమయ్యేది. ఫోటో ఉన్నా చిరునామా లభ్యమయ్యేది కాదు. దీని వల్ల ఎవరి ఫోటోతోనైనా అక్రమాలు చేయడం సులభంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి టోకెన్‌పై గుర్తింపుకార్డు నెంబరు ఉండడం వల్ల చిరునామా కూడా తెలిసిపోతుంది. కౌంటర్లలో పనిచేసే సిబ్బంది ఎవరిలో ఒకరి గుర్తింపుకార్డులు తీసుకొచ్చి టోకెన్లు తీసుకున్నా పదేపదే ఒకే కార్డులో టోకెన్‌ తెచ్చుకుంటున్నా కంప్యూటర్‌ ఇట్టే పట్టేస్తుంది. ఈ అక్రమాలకు బ్రేక్‌ పడితే శ్రీవారికి లక్షలాదిరూపాయలు ఆదా అవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదవి కోసం ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు జెఈఓ వంతు..!