తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాహనసేవల్లో కళాప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
మహరాష్ట్ర - డోల్ పతాక్ : మహరాష్ట్ర తుల్జాపూర్‌కు చెందిన ఎమిజి కాటిగర్ మహరాజ్ బృందంలోని 60 మంది మహిళా కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. ఈ వాయిద్య ప్రదర్శన ఎంతో వినసొంపుగా ఉంటుంది. వీరు గత 24 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనసేవలలో కళాప్రదర్శనలు ఇస్తున్నారు.
దక్షిణ కర్ణాటక - కోలాటం, యక్షగానం, భరతనాట్యం : దక్షిణ కర్ణాటక పుత్తూరుకు చెందిన శ్రీ రామ మహిళా భజన మండలిలోని 20 మంది బృందం అమ్మవారి వాహనసేవలలో కోలాటం, యక్షగానం, భరతనాట్యం ప్రదర్శించింది. ఈ బృందంలోని కళాకారులు శ్రీవారి వాహనసేవలలో ప్రదర్శనలు ఇచ్చారు. మొదటిసారిగా అమ్మవారి వాహనసేవలలో ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
పాండిచ్చేరి - జల్రాటం మరియు భరతనాట్యం : పాండిచ్చేరికి చెందిన పుదునై భరదాలయా భజన మండలికి చెందిన 20 మంది మహిళా బృందం జల్రాటం, భరతనాట్యం భక్తులను ఆకర్షిస్తున్నాయి.
హోసూరు - భరతనాట్యం : తమిళనాడు హోసూరుకు చెందిన అభినయ నాట్యాలయ డాన్స్ అకాడమికి చెందిన 32 మంది కళాకారులు ఉన్నారు. ఇందులో వివిధ దేవతా మూర్తుల అలంకారంతో చక్కటి భరతనాట్యం ప్రదర్శించారు.
వైజాగ్ - కోలాటం : వైజాగ్‌కు చెందిన శ్రీమతి భవాని ఆధ్వర్యంలో సీతారామ కోలాట సమితికి చెందిన 11 మంది మహిళా బృందం చక్కగా కోలాట నృత్యాన్ని ప్రదర్శించారు.