శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్దశేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి అలంకారంలో అనుగ్రహించారు.
అనంతశ్చ అస్మి నాగానాం... సర్పానాం అస్మి వాసుకిః... తాను నాగులలో శేషుడిని, సర్పాలలో వాసుకిని అని సాక్షాత్తు పరమాత్మ చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు తన శిరస్సుపై సమస్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు.
శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.