Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఎన్నో అద్భుతాలు వున్నాయి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మానవ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే భారీ స్థాయిలో భక్తులు వెంకన్నను దర్శించుకుంటూ వుంటారు. ఇప్పటికే క్రిస్మస్, న్యూఇయర్ సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా వుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది.
శ్రీవారి ఏడు కొండలు పొగమంచుతో చుట్టుముట్టాయి. తిరుమల సప్త గిరులు హిమ గిరులను తలపిస్తున్నాయి. వెంకన్న ఏడు కొండలు మంచు కొండల్లా మారాయి. శ్రీవారి కొండలను మంచు దుప్పటి కప్పేసింది. ముఖ్యంగా తిరుమల రెడో ఘాట్ రోడ్డు వద్ద ఆనుకుని వున్న కొండ లోయలలో తెరలు తెరలుగా మంచు తివాచీలు పంచుకున్నాయి. ఈ దృశ్యాలు భక్తులను ఆశ్చర్య పరుస్తున్నాయి. దివి నుంచి భువికి వెండి మబ్బులు దిగివచ్చినట్లు ఆ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ దృశ్యాలను భక్తులు సెల్ ఫోన్లలో బంధించి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇకపోతే... తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసి పోయి కనిపిస్తున్నాయి.
ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల రద్దీగా మారిపోయింది. మాడవీధులు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువగా ఉండటంతో అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.