Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?
, సోమవారం, 27 జులై 2020 (14:15 IST)
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. 
 
వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
 
వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి.  
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.
 
ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.
 
ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-07-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. యజమానులను తక్కువ చేసి..?