పుణ్యము అనగా శిథిలము కాకుండా వుండునది. అట్టి పుణ్యము ఆద్యమైనది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైన వాటికి ఒక ప్రత్యేకమైన వాసన వున్నట్లే జగమునందు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన వాసన కలిగి యుండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించి యుండి కలుషితము గానటువంటి పరిమళము శ్రీకృష్ణుడే అయి వున్నాడు. వాసన రీతిగానే ప్రతిదియును, రుచిని కలిగి యుండును.
ఇక అగ్ని లేనిదే కర్మాగారములను నడుపుట, వంట చేయుట తదితర కార్యములు ఏమియును మనము చేయజాలము. అట్టి అగ్ని మరియు అగ్ని యందలి ఉష్ణము శ్రీకృష్ణుడే. ఆయుర్వేదం ప్రకారం ఉదరములో జఠరాగ్ని మందగించుటయే అజీర్తికి కారణము. అనగా ఆహారము పచనమగుటకు కూడా అగ్నియే అవసరము. ఈ విధముగా భూమి, జలము, అగ్ని, వాయువు, సర్వచైతన్య పదార్థములు శ్రీకృష్ణుని వలననే కలుగుచున్నవని కృష్ణభక్తిరస భావన ద్వారా మనం తెలిసికొనగలము.
మనుజుని ఆయుఃపరిమితి కూడా కృష్ణుని చేతనే నిర్ణయింపబడుచున్నది. కనుక ఆ కృష్ణుని కరుణచే మనుజుడు తన ఆయుఃపరిమితిని పెంచుకొనుటకు లేదా తగ్గించుకొనుట చేసుకోవచ్చును. అంటే కృష్ణభక్తిరస భావనయే అన్ని రంగములయందును అవసరము.