Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దరిద్ర దేవత ఎక్కడ నివసిస్తుందో తెలుసా? శనివారం రావిచెట్టు?

Advertiesment
Jyestya Devi
, బుధవారం, 29 మే 2019 (10:24 IST)
పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీ దేవిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెళ్ళి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి ''ఓ నారాయణా! నాకన్నా పెద్దదైన అక్క ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్ఠనైన నేను వివాహమాడడం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు'' అని కోరింది. 
 
ధర్మబద్ధమైన ''శ్రీదేవి'' మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూల వదన, అశుభకారిణి, అరుణ నేత్రి, కఠిన గాత్రి, బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు.
 
అయితే... నిరంతర హోమధూమ సుగంధాలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠా దేవి దుఃఖిస్తూ ''ఓ ఉద్దాలకా! నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే, అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగానీ, పితృదేవతలు పూజింపబడే చోటగానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడూ, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను. 
 
ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉస్సూరుమంటారో, ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూంటాయో, ఎక్కడయితే దురాచారాలు, పరద్రవ్య, పర భార్యాపహరణ శీలులైన వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మ హత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను'' అంది. 
 
జ్యేష్ఠాదేవి మాటలకు కించిత్తు నొచ్చుకున్న వేదవిదుడైన ఉద్దాలకుడు ''ఓ జ్యేష్ఠా! నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో'' అని చెప్పి బయల్దేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం రావిచెట్టు మొదలులో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి... ఉద్దాలకుడు ఎన్నాళ్ళకీ రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్దపెట్టున దుఃఖించసాగింది. 
 
ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమెని ఊరడిస్తూ ''ఓ జ్యేష్ఠాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్తుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది'' అని చెప్పాడు. 
 
ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేట్లు ఏర్పరిచాడు శ్రీహరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం (29-05-2019) మీ రాశిఫలాలు - మీ సంతానం విద్యా విషయాలు...